హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): పౌల్ట్రీ రంగాన్ని ఉపాధి కల్పించే వనరుగా చూస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2025 కార్యక్రమానికి మంగళవారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమ రాష్ట్ర జీడీపీకి సుమారు రూ.22,938 కోట్లు సమకూరుస్తోందని తెలియజేశారు.
మన దేశంలో గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో, బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందని చెప్పారు. పౌల్ట్రీ వ్యాధులను నివారించడానికి, నియంత్రించడానికి పశు సంవర్ధక శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో పౌల్టీ రంగాభివృద్ధికి తమ ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. కాగా, 3 రోజులపాటు జరిగే ఈ ఎక్స్పోలో సుమారు 50 దేశాల నుండి 500కుపైగా ప్రతినిధులు పాల్గొంటున్నారని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయస్ వెల్లడించారు.