‘పారిశ్రామిక కారిడార్లను తమిళనాడుకు దీటుగా, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు దీటుగా వరంగల్‌లో టైక్స్టైల్పార్క్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే వరంగల్ నుంచి సూరత్ మిల్లులలో దాదాపు 4 లక్షల మంది కార్మికులు వస్ర్తాలను తయారు చేస్తున్నారు. మనవాళ్లు బతుకలేక అక్కడికి వెళ్లి వాళ్ల నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. అక్కడ మేస్త్రీలుగా, మకద్దములుగా మనవాళ్లే ఉన్నారు. చిన్న చిన్న యూనిట్లకు మేనేజర్లుగా మన తెలంగాణ బిడ్డలే వేరే రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు. వారందరినీ నేను పిలిచి మాట్లాడాను. వరంగల్‌లో ఒక లక్ష పవర్‌లూమ్స్‌తో ప్రారంభించి, వాటిని 5,6 లక్షల పవర్‌లూమ్స్ వరకు తీసుకువెళ్తాం.వరంగల్‌ను భారతదేశంలోనే పేరెన్నికగన్న టెక్స్టైల్ హబ్‌గా తీర్చిదిద్దటంలో అందరం భాగస్వాములమవుదాం’
– 2014 నవంబర్ 11న పారిశ్రామిక విధాన నిర్ణయమైన టీఎస్-ఐపాస్‌పై
‘గత పాలకుల నిర్లక్ష్యానికి మూతపడ్డ ఆజం జాహీ మిల్లును తలదన్నేరీతిలో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్క్‌కు భూమి పూజ చేసుకున్నాం. కాకతీయుల పేరుతో మన ప్రాంతానికి బర్కత్ ఉంటుందని ఈ పార్కుకు వాళ్ల పేరు పెట్టుకున్నం. ఇది దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్పార్క్గా రూపుదిద్దుకోబోతున్నది. పొట్టచేతపట్టుకొని బతుకుదెరువు కోసం సూరత్, భీవండీ, షోలాపూర్ ప్రాంతాలకు వలసలు వెళ్లిన నేతన్నల్లారా మీరంతా ఆత్మగౌరవంతో స్వరాష్ర్టానికి తిరిగి రావాలె. వా రికి మన గడప దగ్గరే ఉపాధి దొరకాలె. అదే నా కల!
– 2017 అక్టోబర్ 10న వరంగల్‌లో కాకతీయ మెగాటెక్స్టైల్పార్క్కు భూమి పూజ చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాటలు
పడావుపడ్డ ఆశ తిరిగి ప్రాణం పోసుకుంటున్నది. మూగబోయిన కటక్.. కటక్.. కటక్… కటక్మనే శబ్దనాదాలు మళ్లీ చెవుల్లో మారుమోగుతున్నాయి. షిఫ్ట్‌ల వారీగా తనను తాను మలుచుకునే కాలం వరంగల్‌కు చేరువ అవుతుందనే నమ్మిక జీవం పోసుకుంటున్నది. సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట బొగ్గనాల బోడుగా… బల్లపరపు మైదానంగా కనిపించిన నేలను ఇప్పుడు చూస్తే ఎగిరి గంతేయాలనిపించేలా మారిపోయింది. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు వరంగల్‌ను మండించాయి. ఆజం జాహీ మిల్లు స్థానంలో పడుగూ పేకలు మళ్లీ కళగా జీవం పోసుకుంటాయా? అన్న అనుమానం ఉండేది. కానీ, ఇప్పుడా అనుమానం అక్కర్లేదు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థలు… వస్త్ర పరిశ్రమకు కొండగుర్తుగా నిలిచే సంస్థలు ఠీవీగా ముస్తాబు అవ్వడాన్ని చూసి.. తెలంగాణతో ‘పోగు’ బంధం బలపడుతుందన్న విశ్వాసం కలుగుతున్నది.
వరంగల్ అంటే ఒకప్పుడు ఆజం జాహీ మిల్లు. పదివేల మందికి ఉపాధిని కల్పించిన మిల్లు మాత్రమే కాదది. వరంగల్, హన్మకొండ పట్టణాలకు విద్యుత్ వెలుగులను ప్రసాదించి, ప్రగతిపూల గంధాలను వెదజల్లిన నెలవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలకుల పుణ్యమా అని ఆ మిల్లు, మిల్లు భూములు అర్రాజుపాటలయ్యాయి. నెత్తురు మరిగి నినదించిన రెక్కలను ఉమ్మడిపాలకులు కర్కశంగా విరిచేశారు. నినదించే గొంతులను కనిపించకుండా చేశారు. చీరెను నేసి అగ్గిపెట్టేలో పెట్టిన నేతన్నల నేర్పరితనం బతుకుజీవుడా అని దేశం బాట పట్టింది. కానీ, ‘కేసీఆర్ సర్కార్ ఎనిమిదేండ్లనాడు వేసిన పునాది రాయిమీద వస్త్ర పరిశ్రమలు పడుగూ పేకలై జమిలీగా అల్లుకుపోతున్నవైనం అబ్బురమనిపిస్తున్నది. ఇంతలో మా ఊరు ఇంతలా పెరిగిపోతదని అనుకోలేదు’ అని శాయంపేట, చింతలపల్లి వాసులే కాదు యావత్ తెలంగాణే అచ్చెరువొందుతున్నది. ఇప్పటి ప్రభుత్వమూ ఆ కలను సాకారం చేయడం కోసం కేసీఆర్‌లా పరితపిస్తే నేతన్న ఇంకెంత మురిసిపోతాడో…!
వరంగల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల్లోని చింతలపల్లి, శాయంపేట గ్రామాల్లో చింతపల్లి రైల్వేస్టేషన్‌కు అటూ ఇటూ 1357 ఎకరాల సువిశాల స్థలంలో ‘ఫాం టు ఫ్యాబ్రిక్’ నినాదంతో సరికొత్త వస్త్రనగరికి 2017 అక్టోబర్ 22వ తేదీనాడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌గా దీనికి నామకరణం చేశారు. భూమి పూజ చేసిన్నాడే దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్, ది స్వయంవర్ గ్రూప్, గోకుల్దాస్ ఇమేజేస్, సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్స్, సూర్యోదయ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, నందన్ డెనిమ్, షాహీ ఎక్స్పోర్ట్, జేకోట్ ఇండస్ట్రీస్ సహా దాదాపు రూ.3020 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఇందులో యంగ్వన్ అనే సంస్థదే దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడి. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఒక హెలికాప్టర్లో వస్తే యంగ్వన్ సహా పలు కంపెనీల ప్రతినిధులు రెండు హెలిక్యాప్టర్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో దిగారు. తెలంగాణ ప్రజలకు పారిశ్రామిక విశ్వాసాన్ని కల్పించారు. అన్నట్టుగానే మెగాటెక్స్‌టైల్ పార్క్‌లో పరిశ్రమల స్థాపన, ఆయా సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించేందుకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, అంతర్గత రోడ్లు, విద్యుత్ సౌకర్యం లాంటి అనేక వసతులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గణేశా, గణేశా ఇన్ఫోటెక్, యంగ్వన్, కిటెక్స్ సంస్థలు తమతమ యూనిట్లను కొనసాగిస్తున్నాయి. గణేశా ఇప్పటికే ఎగుమతులు ప్రారంభించగా కిటెక్, యంగ్వన్ వివిధ యూనిట్ల ఉత్పత్తులను ప్రారంభించాయి. పై రెండు మండలాల్లోని గ్రామాలవారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారికీ ఉపాధి దొరుకుతున్నది. ఆయా సంస్థలు నిర్వహించే ప్రత్యేక బస్సులతోపాటు ఆర్టీసీ, అందుబాటులో ఉన్న ఆటోలు పనివేళలకు అనుగుణంగా మెగాటెక్స్‌టైల్ బాటపడుతున్నాయి.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయంతోపాటు కేటీఆర్ చూపిన ప్రత్యేకంగా చొరవ చూపకపోతే తమ కార్యకలాపాలను వరంగల్‌లో ప్రారంభించేవాళ్లం కాదని కిటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ సాబు ఎం. జాకబ్ కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్‌లో యూనిట్ శంకుస్థాపన (2022 మే, 7) సందర్భంగా అంతకుముందు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో హైదరాబాద్‌లో చెప్పారు. నిజానికి కిటెక్స్ గ్రూప్ కొచ్చిలో రూ.3,500 కోట్లతో మెగా ప్రాజెక్టును స్థాపించేందుకు 2020 జనవరిలో కేరళ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నది. అయితే, ఆ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించకపోవటం వల్ల ఆ పెట్టుబడిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తామని కిటెక్స్ 2021 జులైలో ప్రకటించింది. దీంతో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని దాదాపు 12 రాష్ట్ర ప్రభుత్వాలు కిటెక్స్ యాజమాన్యాన్ని సంప్రదించాయి.
కేరళ నుంచి కిటెక్స్ కంపెనీ తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నదనే విషయం తెలియగానే ఆ సంస్థ ఎండీ జాకబ్‌తో నాటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ సంప్రదింపులు జరిపారు. 2021 జూలై 9న హైదరాబాద్‌కు ఆహ్వానించారు. ఐటీసీ కాకతీయ హోటల్లో కేటీఆర్ సమావేశమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో నిపుణులైన మానవ వనరులు, టెక్స్టైల్ రంగ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కృషి, రాష్ట్రంలో సాగవుతున్న నాణ్యమైన పత్తి తదితర అంశాలను వారికి వివరించారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి టీఎస్- ఐపాస్ నిబంధనల ప్రకారం మెగా ప్రాజెక్ట్ హోదా లభిస్తుందని, దానికి తగినట్టుగానే రాయితీలు, ప్రభుత్వ సహకారం ఉంటుందనీ వివరించారు. ఈ పవర్‌పాయింట్ ప్రజేంటేషన్తో మాత్రమే కాకుండా వరంగల్ క్షేత్రస్థాయిలో ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పారులో కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని కోరారు. అన్నీ సక్రమంగా ఉన్నాయనుకుంటేనే పెట్టుబడులు పెట్టండని కిటెక్స్ బృందాన్ని వరంగల్‌కు పంపించారు కేటీఆర్. ఆయన సూచనకు అనుగుణంగా ఆ బృందం టెక్స్‌టైల్‌పార్క్‌ను పరిశీలించింది. హైదరాబాద్‌కు చేరుకోగానే.. నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లింది. నాడు కేసీఆర్ ప్రభుత్వం చూపిన చొరవ.. శ్రద్ధకు కిటెక్స్ బృందం ఫిదా అయింది. తాము పెట్టుబడులు పెడతామని ప్రకటించింది.
కిడ్స్‌వేర్ తయారీ రంగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా కిటెక్స్‌కు పేరున్నది. 50 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఈ కంపెనీ సొంతం. కేరళకు చెందిన ఎంసీ జాకబ్ 1968లో ఎర్నాకుళం జిల్లా కిజకంబళంలో ‘అన్నా కిటెక్స్ గ్రూప్’ను స్థాపించారు. అల్యూమినియం ఉత్పత్తులతో ప్రారంభమై మసాలాలు, టెక్స్టైల్స్, సూల్, ట్రావెల్ బ్యాగ్స్ తదితర రంగాల్లోకి విస్తరించిన ఈ సంస్థ 1992లో ఎంసీ జాకబ్ కుమారుడు సాబు ఎం జాకబ్ ‘కిటెక్స్ గార్మెంట్స్’ను స్థాపించారు. ‘లిటిల్‌స్టార్’ బ్రాండ్ పేరుతో చిన్న పిల్లల దుస్తులను తయారు చేస్తున్నది. కంపెనీ ఉత్పత్తుల్లో 90 శాతం అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో యూనిట్ నెలకొల్పిన దక్షిణ కొరియాకు చెందిన వస్త్ర పరిశ్రమ యంగ్వన్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాల్లో వస్త్ర తయారీలో దాదాపు 90 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నది. టైక్స్‌టైల్ పార్క్‌కు కేసీఆర్ ప్రభుత్వం భూమి పూజ చేసిన్నాడే ఒప్పందం కుదుర్చుకొని తన 8 యూనిట్లను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. యంగ్వన్ సంస్థ పురుషులు, మహిళలు, యువకులు, పిల్లలకు రంగురంగుల టీ-షర్ట్స్, జాకెట్స్, స్వెట్లర్స్ ప్రత్యేకించి ప్రపంచ ఆటగాళ్లను సైతం విశేషంగా ఆకర్షించే నాణ్యమైన ఉత్పత్తులను రూపొందించనున్నది. అయితే, ప్రస్తుతం ఈ యూనిట్లో తయారవుతున్న టీషర్ట్స్ ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్‌లో మొత్తం 8 ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉండగా తొలిదశలో ఇప్పటి వరకు 25 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆరు భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ప్రస్తుతం ప్రతీనెలా రూ.కోటి విలువైన 15 వేల టీషర్ట్స్‌ను తయారు చేస్తున్నారు. ప్రతీ టీషర్ట్ మీద ‘మేడిన్ తెలంగాణ’ అన్న ట్యాగ్‌లైన్ ఉండటం విశేషం. 2017న నాటి కేసీఆర్ ప్రభుత్వంతో యంగ్వన్ సంస్థ పార్క్‌లో దాదాపు 300 ఎకరాల స్థలంలో పరిశ్రమ నెలకొల్పేందుకు వాగ్దానం చేసింది. 2029 నాటికి ఈ సంస్థ తన అన్ని యూనిట్లలోనూ ఉత్పత్తులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. వరంగల్, హుజూరాబాద్, సంగెం, గీసుగొండ, నర్సంపేట మొదలైన ప్రాంతాల నుంచి యువత యంగ్వన్లో పనిచేస్తున్నారు. ఇందులో సింహభాగం పట్టభద్రులైన మహిళలతోపాటు సాధారణ అక్షరజ్ఞానం ఉన్నవారూ ఉపాధిని పొందుతున్నారు. కార్మిక శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా పరిశ్రమల్లో పనిచేసేవారికి వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నారని అందులో పనిచేస్తున్న వారు పేర్కొన్నారు.
గణేష్ గ్రూప్ సంస్థలైన గణేశా ఎకోపెట్, గణేశా ఎకోటెక్ అనే రెండు యూనిట్లలో ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించింది. రూ. 300 కోట్లతో గణేష్ ఎకోపెట్ పరిశ్రమ రీసైకిల్ ఫిలమెంట్ నూలు, రీసైకిల్ పాలిస్టర్ చిప్‌లను తయారు చేస్తున్నది. అలాగే రూ. 250 కోట్ల గణేష్ ఎకోటెక్ పరిశ్రమ పెట్ఫ్లేక్స్, పాలీప్రొఫైలిన్ ఫైబర్లను తయారు చేస్తుంది. ఈ రెండు యూనిట్ల ద్వారా దాదాపు 750 మందికి ఉపాధి లభిస్తున్నది.
1932లో వరంగల్‌లో ఆజం జాహీ మిల్లు కోసం నిజాం ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. మిల్లు నిర్మాణానికి వరంగల్ రైల్వేస్టేషన్ దగ్గర 202 ఎకరాల స్థలం కేటాయించింది. నిజాం ప్రభుత్వం అధీనంలో ఉండే ఇండస్ట్రీయల్ ట్రస్ట్ ఫండ్ నుంచి నిధులు కేటాయించింది. 1934 జులైలో ఆజం జాహీ మిల్లు తన ఉత్పత్తులను ప్రారంభించింది. 416 లూమ్స్‌తో ప్రారంభమైన మిల్లు దశలవారీగా విస్తరించింది. 1929 నుంచి వరంగల్‌లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాలని సర్వే పనులు జరిగినా కారణాంతరాల వల్ల సాగలేదు.
అదే ఆజం జాహీ మిల్లు స్థాపనకు నిజాం సర్కార్ నిర్ణయం తీసుకోగానే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ క్రమంలో M/S ఆజం జాహీ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను నెలకొల్పి దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని నిజాం నిర్ణయం తీసుకున్నారు. మిల్లు అవసరాలకు పోను మిగులు విద్యుత్‌తో నాటి వరంగల్, హనుమకొండ పట్టణాల గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాలు తీరాయి. 1935లో మిల్లుకు 1.83లక్షల యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తుండగా, 1938 నాటికి అది 3.12 లక్షల యూనిట్లకు చేరింది. దీంతో 1948-49లో అజంబాద్ (మహారాష్ట్ర) నుంచి హన్మకొండకు 66 కేవీ లైన్‌ను వేశారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి మిల్లుకు నీటిని సరఫరా చేసినట్టు నిజాం రికార్డులు చెబుతున్నాయి.
వస్త్ర పరిశ్రమకు కావలసిన ముడిసరుకు వరంగల్‌లో అనుకున్న స్థాయిలో లేకపోయినా కేవలం వందల ఎకరాల్లోనే జిల్లాలో పత్తిసాగు జరిగినా నిజాం సర్కార్ ఆజం జాహి మిల్లును స్థాపించింది. ఆదోని, బీజాపూర్, బళ్లారి, గుల్బర్గా, హుబ్లీ, జాల్నా, నిజామాబాద్, పర్భణీ మొదలైన ప్రాంతాల నుంచి పత్తిని వరంగల్‌కు తరలించింది. 1934 నుంచి 1963 వరకు అంటే దాదాపు మూడు దశాబ్దాలు స్వశక్తితో పనిచేసిన మిల్లుపై ఉమ్మడి రాష్ట్ర పాలకులు పగబట్టారు. 1963లో అప్పటి ప్రభుత్వం మిల్లును తన ఆధీనంలోకి తీసుకున్నది. తెలంగాణ ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నుంచి దాదాపు 10 వేల మందికి ఉపాధి కల్పించిన మిల్లుకు గ్రహణం మొదలైంది.
ఇతర ప్రాంతాలకు చెందిన కార్మికులను, అధికారులను నియమించడం మొదలైంది. దీంతో మిల్లులో తెలంగాణేతర పెత్తనం పెరిగి సంస్థ క్రమక్రమంగా నష్టాల్లో కూరుకుపోవడం మొదలైంది. ఈ నేపథ్యంలో 1971లో మిల్లును ఉమ్మడిపాలకులు కేంద్ర ప్రభుత్వ జౌళీ శాఖకు అప్పగించారు. 1990వ దశకం వచ్చేనాటికి మిల్లును సిక్ యూనిట్‌గా బలవంతంగా మార్చారు. ఇటు ఉమ్మడి రాష్ట్రంలో, అటు కేంద్రంలో రెండుచోట్లా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా… మిల్లును పునరుద్ధరించేందుకు ఏ మాత్రం ప్రయత్నాలు చేయలేదు. ఆ తరువాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఆజం జాహీ మిల్లు ఆనవాళ్లను పూర్తిగా నేలమట్టం అయ్యాయి.
మిల్లును పునరుద్ధరిస్తామని ఉమ్మడి రాష్ట్రంలో నాడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా హామీలు ఇచ్చాయి. అఖిలపక్షంగా ఏర్పడి పోరాటాలు చేసినట్టు నటించాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఇలా దాదాపు రెండు దశాబ్దాలపాటు రాజకీయాలు చేశాయి. కమ్యూనిస్టులు అఖిలపక్షంలో అటు వాళ్లతో ఇటు వీళ్లతో కలిసి పోరాటం చేశారు. ఇవ్వాళ రాష్ట్రంలో వరంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది నాయకులు ఆజం జాహీ మిల్లు పోరాటాలతో ఎదిగినవారే, మిల్లు హక్కుల కోసం తిరిగినవారే!! కానీ, వరంగల్ దురదృష్టమో, ఆ నాయకుల అదృష్టమో తెలియదు కానీ విజయవంతంగా మిల్లును పోగొట్టారు. ఆఖరికి మిల్లు భూములను అర్రాజుపాడి అమ్మేశారు. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకున్న తొలిదశ నుంచి వరంగల్ ఆజం జాహీ మిల్లు స్థానే మరో ప్రత్యామ్నాయం చూపుతానని ఉద్యమనాయకుడిగా కేసీఆర్ వరంగల్ ప్రజలకు అభయం ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టకున్నారు.
యంగ్వన్లోని ప్రొడక్షన్ యూనిట్లో సూపర్వైజర్గా చేస్తున్నాం. స్టార్ట్ చేసినపుడు అందరూ అంటే ఇంతపెద్దగా యూనిట్లు ఉంటాయనుకోలేదు. నేను పీజీ చేసిన. ఇక్కడ అన్ని యూనిట్లు పూర్తిస్థాయిలో స్టార్ట్ అయితే చాలా మందికి బెనిఫిట్ అయితది. అందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా ఉన్నది. ఎంప్లాయిమెంట్ కోసం ఎక్కడికో వెళ్లే బదులు ఇక్కడే దొరుకుతుంది. అవసరమైతే ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడైతే సింగిల్ షిఫ్టే రన్ అవుతుంది. ఇంకా పూర్తిస్థాయిలో అయితే మంచిగా ఉంటది. ల్యాండ్ లూజర్ ( పార్క్ నిర్మాణానికి భూములు ఇచ్చిన) కుటుంబాల వాళ్లూ మాతో పనిచేస్తున్నరు.
– బొనగాని శ్వేత, పోచమ్మమైదాన్ వరంగల్
టీ షర్ట్స్ మేకింగ్‌లో చేస్తున్నాం టీ షర్ట్స్ తయారీ యూనిట్లో స్టిచ్చింగ్ చేస్తున్న. ఇందులో (యంగ్వన్) ఇప్పుడైతే 300 మందిమి పనిచేస్తున్నం. ఇంకా కడుతున్నరు. మేం చేసేది చిన్నదే అంటున్నరు. పెద్దపెద్దవి తరువాత ప్రారంభిస్తరట. నాకు అంతకుముందే స్టిచ్చింగ్ ప్లస్ మగ్గం వర్క్ కూడా వస్తుంది కాబట్టి మిగితావాళ్ల కన్నా కొంచెం స్పీడుగా పనిచేస్త.
– కనకం స్రవంతి, తుమ్మనపల్లి హుజూరాబాద్
నేను ఇంటర్ వరకు చదివిన. పార్క్ మాకు దగ్గర్లనే ఉంటుంది. బస్సులో వచ్చిపోతం. ట్రైనింగ్ వాళ్లే ఇచ్చారు. అంతకుముందు వ్యవసాయ పనులకు పోయేది. పనికేం ఇబ్బంది లేదు. ముందు ఎట్లుంటదో అనుకున్నం. కానీ, చేస్తాంటేనే కదా వచ్చేది.
– ఉడుతలబోయిన స్వాతి, ధర్మారం
– నూర శ్రీనివాస్
– గొట్టె వెంకన్న