ముంబై/న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ధంతేరాస్‌కు ధరల సెగ గట్టిగానే తాకింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ధరల కారణంగా బంగారం విక్రయాలు భారీగా పడిపోయినప్పటికీ వెండి అమ్మకాలు మాత్రం పెరిగాయి. ఈసారి ధంతేరాస్న ఆభరణాల అమ్మకాలు 15 శాతం వరకు పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. బంగారం రికార్డు స్థాయి ధరల కారణంగా కొనుగోలుదారులు తక్కువ ధర కలిగిన వెండికి మొగ్గుచూపారు. దీంతో వెండి నాణేల అమ్మకాలు 35 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగినట్టు తెలుస్తున్నది. ధంతేరాస్ కారణంగా శనివారం మధ్యరాత్రి వరకు, అలాగే ఆదివారం కూడా ఆభరణాల స్టోర్లు తెరిచివుంచనున్నారు.
గడిచిన ఏడాదికాలంలో పదిగ్రాముల బంగారం ధర రూ.63 శాతం ఎగబాకి రూ.1.32 లక్షలకు చేరుకున్నది. ఏడాదిక్రితం ధంతేరాస్ రోజున గోల్డ్ ధర రూ.81,400గా ఉన్నది. అలాగే వెండి ధరలు 40 శాతం మేర అధికమయ్యాయి. అధిక ధరల కారణంగా కొనుగోలుదారులు 1-50 గ్రాముల బరువు కలిగిన నాణేలకు మొగ్గుచూపారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూవెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్(జీజేసీ) చైర్మన్ రాజేశ్ రోక్దే మాట్లాడుతూ..ఈ ఏడాది ధంతేరాస్ రోజున బంగారం అమ్మకాలు 10-15 శాతం వరకు తగ్గే అవకాశాలున్నప్పటికీ మొత్తం పండుగ బిజినెస్ మాత్రం రూ.50 వేల కోట్లను అధిగమించవచ్చన్నారు. మెట్రో నగరాలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వెండి నాణేల సేల్స్ 35-40 శాతం వరకు పెరిగాయన్నారు. అమ్మకాలు పడిపోయినప్పటికీ విలువ పరంగా చూస్తే మాత్రం 20-25 శాతం వరకు పెరిగాయి.
టాప్‌గేర్‌లో వాహన అమ్మకాలు
వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. ధంతేరాస్ కావడంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. మారుతి సుజుకీ ఏకంగా 50 వేల యూనిట్లను ఒకేరోజు విక్రయించినట్టు తెలుస్తున్నది. 41 వేల కార్లను ఈరోజు డెలివరీ చేసినట్టు కంపెనీ సీనియర్ ఉన్నతాధికారి పార్థో బెనర్జీ ఒకరు తెలిపారు. కంపెనీ చరిత్రలో ఒకేరోజు ఇన్ని వాహనాలు డెలివరీ చేయడం ఇదే తొలిసారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక విక్రయాలు 20 శాతం పెరిగాయని హ్యుం దాయ్ ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపుతో వాహన ధరలు భారీగా తగ్గడంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. వాహనాలతోపాటు టీవీలు కూడా అత్యధికంగా అమ్ముడయ్యాయి. 55 ఇంచులు, అంతకంటే పెద్దవి కలిగిన టీవీలు ఈ నెల 1 నుంచి 17 వరకు 36 శాతం పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
ఆన్లైన్లో బంగారు, వజ్రాభరణాలనూ భారతీయులు కొనేస్తున్నారు. ఫిక్కీ-డెలాయిట్ నివేదిక ప్రకారం 73 శాతం వినియోగదారులు ఈ-కామర్స్ వేదికల ద్వారా గోల్డ్, డైమండ్ నగలను కొనడం మొదలుపెట్టారని తేలింది. అమెజాన్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఇండియా సేల్స్ నిరుడుతో పోల్చితే 96 శాతం ఎగబాకాయి. హాల్‌మార్క్ సర్టిఫికేషన్లు, బ్రాండ్ అస్యూరెన్స్లు వంటివి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.