జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పెద్ద ఎత్తున రౌడీషీటర్లు, నేరచరితులు, వ్యభిచారగృహాల నిర్వాహకులు పాల్గొనడం జూబ్లీహిల్స్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నగరంలో పేరుమోసిన రౌడీషీటర్లయిన కృష్ణయాదవ్ అలియాస్ గొల్లకిట్టు, వ్యభిచార గృహాల నిర్వాహకుడైన రాంనగర్ అఖిల్ పహిల్వాన్‌తో సహా పెద్ద సంఖ్యలో రౌడీలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొని హల్చల్ చేయడంపై సోషల్‌మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
బంజారాహిల్స్,అక్టోబర్ 18: నామినేషన్ సందర్భంగా కర్రలు, గదలతో విన్యాసాలు చేయడం, నడిరోడ్డుపై క్రేన్లతో భారీ దండలు తీసుకువచ్చి ట్రాఫిక్‌కు అడ్డంకులు సృష్టించి ద్వారా రౌడీషీటర్లు హంగామా చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే నగరంలోని అన్ని పోలీస్స్టేషన్లకు చెందిన రౌడీషీటర్లను బైండోవర్ చేస్తుంటారు. ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రచారం తదితర కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితిల్లో రౌడీషీటర్లు పాల్గొనవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తుంటారు.
రౌడీషీటర్లు బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే ఓటర్లు భయబ్రాంతులకు గురవుతారని, దీనివల్ల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే పరిస్థితి ఉండదని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తుంటారు. అయితే అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌పై సుమారు 30ఏళ్లుగా రౌడీషీట్ ఉండడంతో పాటు నగరంలోని నేరస్తులు, రౌడీషీటర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. పలుమార్లు జైలుకు వెళ్లిన శ్రీశైలం యాదవ్‌కు అక్కడ కూడా పెద్ద సంఖ్యలో రౌడీలతో పరిచయాలు ఉండడంతో వారిలో చాలా మంది నవీన్ యాదవ్ నామినేషన్ రోజున భారీ సంఖ్యలో వచ్చి హడావుడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పోలీసులను చూస్తేనే గజగజ వణికిపోయే అనేకమంది రౌడీషీటర్లు నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో స్వేచ్ఛగా విహరించడం, వారికి వెస్ట్‌జోన్ డీసీపీతో సహా అనేక మంది అధికారులతో కూడిన పోలీసులు బందోబస్తు ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ ముందు చేతులు కట్టుకుని నిలబడే పేరుమోసిన నేరగాళ్లంతా యథేచ్ఛగా ర్యాలీలో పాల్గొనడంతో తమ పరువుపోయినట్లయిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి తెలిపారు. రాంనగర్ అఖిల్ పహిల్వాన్ అనే వ్యక్తిపై లెక్కకు మించి బ్రోతల్ కేసులున్నాయని, జాతీయస్థాయిలో హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్కింగ్ కలిగిన అఖిల్ పహిల్వాన్ పలుమార్లు అరెస్టయ్యాడని, అలాంటి వ్యక్తి జూబ్లీహిల్స్ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో అధికారపార్టీ అభ్యర్థితో పాటు పాల్గొనడాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలా సమర్థించుకుంటారో అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ర్యాలీతో ట్రాఫిక్ తిప్పలు
– ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 18(నమస్తేతెలంగాణ): జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీతో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేకమంది ర్యాలీలో చిక్కుకుని సమయానికి గమ్యాన్ని చేరుకోలేకపోయారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఇరుకైన రోడ్ల గుండా కాంగ్రెస్ అభ్యర్థి బలప్రదర్శనకు దిగడం ఎంతవరకు సమంజసమని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే తమ పార్టీ అభ్యర్థి సునీతమ్మతోపాటు ఐదుగురం వెళ్లి సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేసినట్టు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ తరహాలోనే ఇతర పార్టీల అభ్యర్థులు నడుచుకుంటే జూబ్లీహిల్స్ ప్రజలు, ఓటర్లు ఇబ్బందిపడే పరిస్థితి ఉండదని సూచించారు.