న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.2,400 తగ్గి రూ.1,32,400కి తగ్గింది. అంతకుముందు ఇది రూ.1,34,800గా ఉన్నది. ధంతేరస్ కావడంతో ఆభరణాల దుఖాణాల్లో కొనుగోళుదారుల సందడి నెలకొన్నప్పటికీ ధరలు తగ్గడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడం వల్లనే దేశీయంగా ధరలు దిగొచ్చాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర అంతే స్థాయిలో తగ్గి రూ.1,31,800గా నమోదైంది. గతేడాది ధంతేరస్ నుంచి ఈసారి ధంతేరస్ వరకు 24 క్యారెట్ బంగారం ధర రూ.51 వేలు లేదా 62.65 శాతం పెరిగింది. ఏడాది క్రితం రూ.81,400గా ఉన్న పదిగ్రాముల ధర ప్రస్తుతం రూ.1.31 లక్షల స్థాయికి ఎగబాకింది.
వెండిది అదే బాట
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వెండి కూడా భారీగా తగ్గింది. అధిక ధరల కారణంగా కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో వెండి ఏకంగా రూ.7 వేలు దిగొచ్చింది. శుక్రవారం రూ.1.77 లక్షలుగా ఉన్న కిలో వెండి ప్రస్తుతం రూ.1.70 లక్షలకు దిగొచ్చింది. మరోవైపు, గడిచిన ఏడాదికాలంలో కిలో వెండి రూ.70,300 లేదా 70.51 శాతం ఎగబాకింది. కిందటి ఏడాది ధంతేరస్ రోజున రూ.99,700గా ఉన్నది.