న్యూఢిల్లీ, అక్టోబర్ 18: బ్యాంకులు భలా అనిపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు ఆర్థిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించాయి. ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా రెండంకెల వరకు వృద్ధిని సాధించాయి. దీంట్లోభాగంగా ఎల్ఐసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐడీబీఐ బ్యాంక్ అయితే ఏకంగా రెండు రెట్లు లాభాన్ని గడించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను బ్యాంక్ రూ.3,627 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు శనివారం ప్రకటించింది. కిందటి ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,836 కోట్లతో పోలిస్తే ఇంచుమించు రెండు రెట్లు అధికమయ్యాయి. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌కు 11.11 శాతానికి సమానమైన 2.22 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించడంతో రూ.1,698.96 కోట్ల నిధులు సమకూరడం వల్లనే లాభాలు భారీగా పెరిగాయని తెలిపింది. బ్యాంక్ వ్యాపారం 12 శాతం వృద్ధితో రూ.5,33,730 కోట్లకు చేరుకున్నది. ఏడాది క్రితం 3.68 శాతంగా ఉన్న బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ గత త్రైమాసికంలో 2.65 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ స్వల్పంగా పెరిగి 0.21 శాతానికి చేరుకున్నది.
పీఎన్బీ
2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.4,904 కోట్ల నికర లాభాన్ని గడించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. కిందటి ఏడాది ఇదే కాలానికి ఆర్జించిన రూ.4,303 కోట్ల లాభంతో పోలిస్తే 14 శాతం వృద్ధిని కనబరిచినట్లు బ్యాంక్ పేర్కొంది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం 5.1 శాతం వృద్ధితో రూ.36.214 కోట్లకు చేరుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.48 శాతం నుంచి 3.45 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 0.46 శాతం నుంచి 0.36 శాతానికి దిగొచ్చాయి.