ఆదివారం 29 మార్చి 2020
Business - Mar 03, 2020 , 00:17:10

‘వివాద్‌ సే విశ్వాస్‌' భేష్‌

‘వివాద్‌ సే విశ్వాస్‌' భేష్‌
  • సమయం, డబ్బు రెండూ ఆదా: నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ, మార్చి 2: ‘వివాద్‌ సే విశ్వాస్‌' పథకంతో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఈ ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కార పథకాన్ని గత నెల 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రకటన సందర్భంగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పథకంతో ఎన్నో లాభాలున్నాయని, ఈ పథకాన్ని ఎంచుకుంటే పన్ను కేసుల్లో పోరాడుతున్నవారికి సమయం, డబ్బూ రెండూ మిగిలే వీలుందన్నారు. సోమవారం లోక్‌సభలో ‘వివాద్‌ సే విశ్వాస్‌' బిల్లు 2020ని ప్రవేశపెడుతూ ‘పన్ను వివాదాలను ఎదుర్కొంటున్నవారికి ఈ పథకం ఓ పరిష్కార మార్గం. కేసులను పరిష్కరించుకోవడానికి సమయం, డబ్బు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని నిర్మల అన్నారు. 


లిటిగేషన్లను తగ్గించాలనే తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న ఆమె.. పరోక్ష పన్ను వివాదాల కోసమూ ఈ తరహా ఓ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు. కమిషనర్‌ (అప్పీల్స్‌), ఐటీఏటీ, హైకోర్టులు, సుప్రీం కోర్టు, రుణ రికవరీ ట్రిబ్యునళ్ల వంటి వివిధ అప్పీలెట్‌ ఫోరమ్స్‌ వద్ద గరిష్ఠంగా రూ.9.32 లక్షల కోట్ల విలువైన 4.83 లక్షల ప్రత్యక్ష పన్ను కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, ‘వివాద్‌ సే విశ్వాస్‌' పథకం కింద ఈ నెలాఖరుకల్లా వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించినైట్లెతే దానిపై వడ్డీ, జరిమానాలను పూర్తిగా రద్దు చేసుకోవచ్చు. జూన్‌ 30దాకా ఈ పథకం అందుబాటులో ఉండనున్నది. ఇదిలావుంటే ఈ బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. 


6.35 కోట్ల ఐటీ రిటర్నులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఫిబ్రవరి ప్రథమార్ధం నాటికి ఎలక్ట్రానిక్‌ వేదికల ద్వారా గరిష్ఠంగా 6.35 కోట్ల ఆదాయం పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలైయ్యాయి. ఈ మేరకు ఓ లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ సోమవారం లోక్‌సభలో తెలిపారు. గత ఆర్థిక  సంవత్సరం 6.28 కోట్లుగానే ఉన్నట్లు చెప్పారు. 
logo