ధరాఘాతంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వంటనూనెలు, పప్పులు, కూరగాయలు.. ఇలా ఆహారోత్పత్తులన్నింటి రేట్లూ భగ్గుమంటున్నాయి మరి. పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో మున్ముందు సగటు జీవి నెత్తిన ధరల కుంపటేననిపిస్తున్నది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు. బజార్లో ప్రతీది ఖరీదెక్కుతున్నది మరి. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభించింది. మార్చిలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.40 శాతంగా నమోదైంది. అంతకుముందు నెల ఫిబ్రవరిలో ఇది 3.21 శాతంగా ఉన్నట్టు సోమవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన వివరాలు చెప్తున్నాయి. కాగా, 2024 బేస్ ఇయర్‌తో కూడిన కొత్త సిరీస్‌లోనే ఈ ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్రం వెల్లడించింది.
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఆహార ధరల సూచీనే ఎగదోస్తున్నదని సర్కార్ లెక్కలు చెప్తున్నాయి. మార్చిలో 3.87 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఇది 3.47 శాతంగానే ఉండగా.. కొబ్బరి, టమాట, కాలీఫ్లవర్ సహా మరికొన్ని కూరగాయల ధరలు మార్కెట్లో భగ్గుమంటున్నట్టు తేలింది. బంగారం, వెండి నగల రేట్లూ పరుగులు పెడుతున్నాయి. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, వెల్లుల్లి, కందిపప్పు, శనగల ధరలు ఇప్పటికైతే పెరుగకున్నా.. ద్రవ్యోల్బణం ఎగిసిపడింది.
విద్యుత్తు, గ్యాస్, ఇతర ఇంధన ధరల సూచీ గత నెల 1.65 శాతానికి ఎగబాకింది. ఫిబ్రవరిలో ఇది 1.52 శాతంగానే ఉన్నది. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణ రేట్లు 3.11 శాతం నుంచి 3.63 శాతానికి పెరిగాయి. ఇక గత నెల మార్కెట్లో ప్రీమియం పెట్రో ఉత్పత్తుల ధరలు, వాణిజ్య వంటగ్యాస్ రేట్లు పెరిగిన సంగతి విదితమే. కాగా, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవలి శాంతి చర్చలు విఫలం కావడంతో.. గల్ఫ్ దేశాల్లో మళ్లీ ఉద్రిక్తకర వాతావరణం అలుముకున్నది. ఇరాన్‌పై అమెరికా తీవ్ర నిర్ణయాల దిశగా వెళ్తుండగా.. అగ్రరాజ్యానికి అండగా నిలబడుతున్న పొరుగు దేశాలపై భీకర దాడులకే ఇరాన్ వ్యూహ రచన చేస్తున్నది.
ఇప్పటికే కువైట్, ఖతార్, ఒమన్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాల్లో ఇరాన్ దాడులతో ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తికి బ్రేకులుపడ్డాయి. మరోవైపు ఇరాన్ భయాలతో హొర్ముజ్ జలసంధిలో రవాణా స్తంభించిపోయింది. ఇది గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్ని ఎగదోస్తుండగా.. దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండటం, అందులోనూ మెజారిటీ వాటా సౌదీ తదితర గల్ఫ్ దేశాలదే కావడం కలవరపెడుతున్నదిప్పుడు. ఇరాన్ వార్ తీవ్రరూపం దాల్చితే అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లకు చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇదే జరిగితే దేశంలో చమురు కష్టాలే. పెరిగే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రేట్లతో రవాణా వ్యయం తడిసిమోపెడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తద్వారా ద్రవ్యోల్బణం మరింతగా పెచ్చుమీరితే.. ఆర్బీఐ కఠిన ద్రవ్యవిధానంతో వడ్డీరేట్లు పెరుగుతాయని, ఇది అంతిమంగా ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. పెరిగే దిగుమతులతో దేశంలోని డాలర్ నిల్వలూ కరిగిపోతాయని గుర్తుచేస్తున్నారు. ఇప్పటిదాకా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగకుండా చర్యలు తీసుకుంటున్నారని, కానీ యుద్ధం తీవ్రతరమైతే రేట్ల పెంపు అనివార్యమేనని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అప్పుడు దేశ జీడీపీపై పెను ప్రభావమే పడుతుందని, ప్రజల జీవన, వ్యయాల్లో భారీ తేడాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మార్చిలో దేశంలోకి వంటనూనె దిగుమతులు 12 శాతం పెరిగి 11.73 లక్షల టన్నులకు చేరాయని సోమవారం ఓ ప్రకటనలో సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) తెలిపింది. ఎక్కువగా ముడి పామాయిల్ దిగుమతులే ఉన్నాయని పేర్కొన్నది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల దృష్ట్యా పెరిగే రవాణా వ్యయం, ధరలతో మున్ముందు దిగుమతులు మందగించే వీలుందన్నది. దీంతో ఇదే జరిగితే దేశీయంగా డిమాండ్‌కు తగ్గ వంటనూనెలు మార్కెట్లో ఉండకపోవచ్చని, ఫలితంగా ఆయా వంటనూనెల రేట్లు అమాంతం పెరిగిపోవచ్చన్న ఆందోళన మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి భారత్‌కు పామాయిల్ అధికంగా వస్తుండగా.. అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయాబీన్ ఆయిల్ ఎక్కువగా దిగుమతి అవుతున్నది. దేశీయ వంటనూనెల అవసరాల్లో సగానికిపైగా దిగుమతుల ద్వారానే తీరుతుండటం గమనార్హం.
దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలోనే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటున్నది. తాజా వివరాల ప్రకారం రాష్ట్రంలో వినియోగదారుల ధరల సూచీ గరిష్ఠంగా 5.83 శాతంగా నమోదైంది. మిజోరామ్‌లో 0.66 శాతమే. నిజానికి ఫిబ్రవరి గణాంకాల్లోనూ రాష్ర్టాల ద్రవ్యోల్బణం లెక్కల్లో తెలంగాణనే టాప్‌లో ఉన్నది. నాడు 5.02 శాతంగా ఉన్నట్టు తేలింది. మార్చిలో అది మరో 0.81 శాతం పెరుగడం గమనార్హం. కిరాణా సరుకుల దగ్గర్నుంచి కూరగాయలదాకా అన్నింటి రేట్లూ పెరుగడంతో పేద, మధ్యతరగతి వర్గాల బతుకు భారమైపోతున్నది.
ముఖ్యంగా నిర్మాణ తదితర కీలక రంగాల్లో నిస్తేజం ఆవరించి ఆదాయం లేక అల్లాడిపోతున్న సామాన్యుల నెత్తిన ఇప్పుడు ధరల పిడుగు పడుతున్నదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ ఎక్కువగా ఉండటం.. ధరల కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.