అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు బూమరాంగ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. చైనాకు చెక్ పెట్టాలని ఎడాపెడా పెంచుతూపోయిన టారిఫ్‌లు.. ఇప్పుడు ట్రంప్ సర్కారునే ఒత్తిడిలో పడేస్తున్నాయి మరి. ట్రంప్ సుంకాలకు దీటుగా స్పందిస్తున్న జిన్‌పిన్ ప్రభుత్వం.. అన్ని రకాలుగా అమెరికాను ఇరుకున పెట్టాలని చూస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా బోయింగ్ జెట్ డెలివరీలు ఆగిపోయాయి.
బీజింగ్/వాషింగ్టన్, ఏప్రిల్ 15: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తల పట్టుకుంటున్నారు. చైనాతో వాణిజ్య యుద్ధం కొరివితో తల గోక్కున్నట్టవుతున్నది మరి. నువ్వా-నేనా అన్నరీతిలో సాగుతున్న ఈ టారిఫ్ వార్‌లో.. చివరకు డ్రాగన్‌దే పైచేయిగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుండటం గమనార్హం. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో చైనాపై అమెరికా ఎంతలా? ఆధారపడుతున్నదో కూడా ఈ సందర్భంగా అందరికీ తెలిసొస్తున్నది. అమెరికా మార్కెట్ చైనాకు ఎంత అవసరమో.. అక్కడి కంపెనీలకు చైనాలోని వ్యాపారావకాశాలు, వనరులు కూడా అంతే అవసరం. సరిగ్గా దీనిపైనే దృష్టి సారించిన జిన్‌పిన్ సర్కారు.. ఆ కోణంలోనే పావులు కదుపుతున్నది. ఇందులోభాగంగానే తాజాగా బోయింగ్ విమానాల డెలివరీలను చైనా ఆపేసింది. అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీకి దూరంగా ఉండాలని తమ దేశ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చైనా స్పష్టం చేసింది. అమెరికా సంస్థల నుంచి ఎయిర్‌క్రాఫ్ట్ సంబంధిత విడిభాగాలను, ఇతరత్రా పరికరాలను కొనవద్దని కూడా హుకుం జారీ చేసినట్టు బ్లూంబర్గ్ చెప్తున్నది.
ప్రస్తుతం అమెరికాలోకి దిగుమతయ్యే చైనా వస్తూత్పత్తులపై 145 శాతం ప్రతీకార సుంకాలు అమలవుతుండగా.. చైనాలోకి దిగుమతయ్యే అమెరికా వస్తూత్పత్తులపై 125 శాతం టారిఫ్‌లు పడుతున్నాయి. ఈ క్రమంలోనే బోయింగ్ జెట్స్‌ను లీజుకు తీసుకుని నడిపిస్తున్న స్వదేశీ విమానయాన సంస్థలకు అధిక టారిఫ్‌లతో పెరుగుతున్న ఖర్చుల నుంచి ఉపశమనం లభించేలా చర్యలనూ చైనా చేపడుతున్నది. కానీ ఈ నిర్ణయం తమ విమాన అమ్మకాల్లో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాను బోయింగ్ కోల్పోయేలా చేస్తున్నది. ఇక ఇప్పటికే ఎలక్ట్రానిక్, రక్షణ, టెక్నాలజీ రంగాల్లో వాడే కీలక ఖనిజాల ఉత్పత్తిని చైనా ఆపేసింది. దీంతో టెస్లా, యాపిల్ మరికొన్ని సంస్థల ఉత్పత్తికి ఇది పెద్ద దెబ్బలా తయారవుతున్నది. ఇతర దేశాలపైనా ఈ ప్రభావం కనిపించేలా ఉండగా.. ట్రంప్ ప్రభుత్వానికి ఇంటా, బయట ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నది. మరోవైపు ట్రంప్ సుంకాలపై గుర్రుగా ఉన్న దేశాలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకూ చైనా కృషి చేస్తున్నది. దీంతో అమెరికాపై ఒత్తిడి రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.
ఫార్మా, సెమీకండక్టర్ దిగుమతులకు ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపునిచ్చిన ట్రంప్.. వీటిపైనా వీలున్నంత త్వరలో అదనపు టారిఫ్‌లు వేయాలని చూస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ఔషధాలు, చిప్‌లతో అమెరికా జాతీయ భద్రతకు వాటిల్లే ముప్పుపై ట్రంప్ సర్కారు దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలో వాణిజ్య విస్తరణ చట్టం 1962లోని సెక్షన్ 232 కింద ఫార్మా, చిప్ ఉత్పత్తులపై సుంకాల పెంపు ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిస్థితుల నడుమ అరబిందో, సన్ ఫార్మా, రెడ్డీస్, గ్లాండ్ ఫార్మా, లుపిన్ తదితర కంపెనీల షేర్లు మంగళవారం సెల్లింగ్ ప్రెషర్‌ను ఎదుర్కొన్నాయి.