వాషింగ్టన్/బీజింగ్, డిసెంబర్ 4: అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలైంది. అయితే ఈసారిది టెక్నాలజీ వార్‌ను సంతరించుకున్నది. చిప్ తయారీపై తీవ్ర ప్రభావం చూపేలా ఇరు దేశాలు పరస్పర ఆంక్షల్ని, నిషేధాల్ని తెచ్చిపెట్టుకున్నాయి మరి. ఈ మేరకు సోమవారం బైడెన్ సర్కారు నిర్ణయాలుంటే.. వాటికి ప్రతిగా మంగళవారం జిన్‌పింగ్ ప్రభుత్వం నిర్ణయాలు వచ్చాయి. నిజానికి గ్లోబల్ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో అమెరికా, చైనాలు ఆధిపత్యం కోసం గత కొంతకాలం నుంచి కొట్టుకుంటున్నాయి. దాన్ని తీవ్రతరం చేస్తూ అమెరికా కొన్ని కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. ఇవి 140 చైనా సంస్థల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇందులో ప్రధాన సెమీకండక్టర్ తయారీ సంస్థలైన పయోటెక్, సైక్యారియర్, నౌరా టెక్నాలజీ గ్రూప్‌లున్నాయి. కాగా, అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ (చిప్) తయారీ టెక్నాలజీ చైనాకు అందకూడదనే లక్ష్యంగా ఆయా ఎగుమతులపై అమెరికా ఆంక్షల్ని విధించినట్టు తెలుస్తున్నది. కటింగ్-ఎడ్జ్ అడ్వాన్స్మెంట్స్ సాంకేతికతలో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దానికి బ్రేకులు వేసేందుకే ఆ టెక్నాలజీలో బలంగా ఉన్న అగ్రరాజ్యం ఈ చర్యలకు దిగిందన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
చైనా ప్రతీకార చర్యలు
అమెరికా తీరుకు చైనా గట్టిగానే స్పందించింది. సెమీకండక్టర్ల తయారీలో కీలక పాత్ర పోషించే విడిభాగాల ఎగుమతులకు బ్రేక్ వేసింది. అమెరికాకు గాలియం, జర్మేనియం, ఆంటిమొని తదితర ప్రధాన హై టెక్నాలజీ సరకు రవాణాకు కళ్లెం వేసింది. జాతీయ భద్రతపై ఆందోళనల దృష్ట్యా మిలిటరీ కోసమైనా, పౌర అవసరాల కోసమైనా జరిగే వీటి ఎగుమతుల్ని నిషేధిస్తున్నట్టు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇంతకుముందు వీటి ఎగుమతులపై ఆంక్షలుండగా, ఇప్పుడు పూర్తిగా నిషేధాన్ని తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గాలియం, జర్మేనియం లభ్యత చాలాచాలా తక్కువగా ఉన్నది. దొరికే ఆ కొద్ది నిల్వలు సైతం చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి. కాగా, సెల్ఫోన్లు, కార్లు, సోలార్ ప్యానెల్స్, మిలిటరీ టెక్నాలజీల్లో వాడే కంప్యూటర్ చిప్స్ తయారీకి ఈ ముడి పదార్థాలన్నీ కూడా చాలాచాలా కీలకం. ఇంకా చెప్పాలంటే మిలిటరీ అప్లికేషన్ల దగ్గర్నుంచి కృత్రిమ మేధస్సు వరకు ఈ సెమీకండక్టర్లే ప్రధానం. దీంతో అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు ఒక్కసారిగా చెడినైట్టెంది. అంతకుముందు అమెరికా.. కొత్త తరం సాంకేతికతతోకూడిన చిప్‌ల తయారీలో వినియోగించే పరికరాలు, అత్యున్నత శ్రేణి మెమరీ చిప్స్, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతుల్ని కఠినతరం చేసింది. గతంలోనూ వీటిపై నిషేధం విధించినా ఆ తర్వాత సడలించింది. మానవ సాయంతో నిమిత్తం లేకుండా స్వయంప్రతిపత్తితో పనిచేయగలిగిన ఆయుధాల తయారీలో ఈ చిప్లే కీలకం. వాటి విడిభాగాలు ప్రస్తుతం అమెరికా నుంచే చైనాకు పెద్ద ఎత్తున వెళ్తున్నాయి.
ట్రంప్ రాకముందే..
అమెరికా నూతన అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరిలో గద్దెనెక్కబోతున్నారు. ఈ క్రమంలో ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడే ఆ వాతావరణం ఏర్పడటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నిజానికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ఆ స్థానంలో ముందున్నది ట్రంపే. అప్పుడు ట్రంప్ దూకుడు.. చైనాతో పరస్పర సుంకాలకు దారితీసింది. కానీ బైడెన్ రాకతో పరిస్థితులు కొంత శాంతించాయి. అయినప్పటికీ గత మూడేండ్లలో అమెరికా-చైనా మధ్య ఈ రకమైన పోరు వస్తూపోతూనే ఉన్నది. ఇప్పుడది తీవ్రరూపం దాల్చగా.. ట్రంప్ రాకతో ఇంకెంత తీవ్రతను సంతరించుకుంటుందోనన్న ఆందోళనలు అంతటా వ్యాపిస్తున్నాయిప్పుడు. ఇక ట్రంప్ హయాంలో చైనా నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున జరిగే ఎగుమతుల కట్టడే లక్ష్యంగా సుంకాల పెంపు జరిగింది. కానీ ఇప్పుడు చిప్ తయారీలో ఆధిపత్యం కేంద్రంగా నిర్ణయాలుంటున్నాయి. మొత్తానికి వచ్చే ఏడాది నుంచి సెమీకండక్టర్ ఇండస్ట్రీల్లో అలజడులు ఖాయమనే చెప్పవచ్చు.
భారత్‌కు లాభమేనా?
అమెరికా-చైనా మధ్య చోటుచేసుకున్న ఈ ట్రేడ్ అండ్ టెక్ వార్.. భారత్‌కు లాభమేనా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇందుకు ట్రంప్ హయాంలో వచ్చిన అవకాశాల్నే గుర్తుచేస్తున్నారు. నాడు చైనాతో అమెరికా వాణిజ్యం పడిపోగా.. భారత్‌సహా మరికొన్ని దేశాలకు పెరిగింది. అమెరికాకు భారత్, వియత్నాం, మెక్సికో నుంచి ఆయా ఉత్పత్తుల ఎగుమతి పుంజుకున్నది. ఇప్పుడు కూడా అమెరికా సాయంతో సెమీకండక్టర్ ఇండస్ట్రీలో భారత్ నిలదొక్కుకోవచ్చన్న అంచనాలున్నాయి. నిజానికి అంతర్జాతీయంగా భారత్ ఎదుగుదలను చైనా అడ్డుకుంటున్నది. కానీ ఇదే సమయంలో భారత్‌పట్ల అమెరికా సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నది. పైగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, డొనాల్డ్ ట్రంప్‌కు నడుమ మంచి స్నేహభావం ఉండటం కూడా ఇక్కడ కలిసొస్తుందని అంటున్నారు. భారత్ వంటి పెద్ద మార్కెట్‌ను వదులుకోవడం అమెరికాకు నష్టమేనని, కాబట్టి సాంకేతికంగా అగ్రరాజ్యం నుంచి సహకారం ఉంటుందనే ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే అమెరికా తాజా నిర్ణయం జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ తదితర దేశాలనూ కొంత ఇబ్బంది పెడుతున్నది. దీంతో ఆసియా మార్కెట్లో అమెరికా-చైనా ట్రేడ్ వార్ గట్టిగానే ప్రకంపనల్ని సృష్టించేలా ఉన్నది.