UPI | డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సరికొత్త మైలురాయిని చేరుకుంది. చరిత్రలో తొలిసారి ఈ నెల 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల లావాదేవీల మైలురాయిని అధిగమించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. గత రెండేళ్లలో రోజువారీ లావాదేవీల (daily transactions) సంఖ్య రెట్టింపు అయ్యింది. 2023 ఆగస్టులో యూపీఐ రోజుకు దాదాపు 350 మిలియన్ల (35 కోట్ల) లావాదేవీలను నమోదు చేసింది. ఇక గతేడాది ఆగస్టులో దాదాపు 500 మిలియన్ల (50 కోట్ల) లావాదేవీలు జరిగాయి.
కాగా, ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో రోజువారీ యూపీఐ లావాదేవీల సగటు 61.3 కోట్లు దాటిపోయింది. వాటి విలువ రూ.80 వేల కోట్లు. కేవలం కొన్ని వారాల్లోనే ఈ సంఖ్య 70 కోట్లు దాటడం విశేషం. 2027 నాటికి రోజువారీ యూపీఐ లావాదేవీల సంఖ్య 100 కోట్లకు చేరుకుంటుందని నిపుణుల అంచనా. భవిష్యత్తులో రోజుకు 100 కోట్ల లావాదేవీలను చేరుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని యూపీఐ నిర్వాహక సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పేర్కొంది. సులభమైన వినియోగ విధానం, వ్యాపారుల నుంచి లభిస్తున్న ఆదరణే ఈ వృద్ధికి కారణమని ఎన్పీసీఐ తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 49.1 కోట్ల మంది వినియోగదారులు, 6.5 కోట్ల మంది వ్యాపారులు యూపీఐని వాడుతున్నారు.
రూ.80 వేల కోట్లకు పెరిగిన విలువ
2016లో సాధారణంగా ప్రారంభమైన యూపీఐ చెల్లింపులు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. 2017 జూన్లో యూపీఐ లావాదేవీల రోజువారీ సగటు 3.5 లక్షలుగా ఉండగా.. ఈ ఏడాది జూన్ నాటికి అది 1,750 రెట్లు పెరిగి 61.3 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రోజువారీ యూపీఐ లావాదేవీల విలువ రూ.80 వేల కోట్లు దాటిపోయింది.
Also Read..
Tesla | ఢిల్లీలో టెస్లా సెకెండ్ షోరూం ప్రారంభానికి రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా..?
గత ఐదేండ్లలో జీఎస్టీ ఎగవేతలు.. రూ.7.08 లక్షల కోట్లు
ఎల్టీఐమైండ్ట్రీ చేతికి పాన్ 2.0 ప్రాజెక్టు