న్యూఢిల్లీ, ఆగస్టు 4: పాన్ 2.0 ప్రాజెక్టు అమలుకు ఐటీ సంస్థ ఎల్‌టీఐమైండ్‌ట్రీ లిమిటెడ్‌ను ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రావచ్చని సోమవారం ఓ అధికారి తెలిపారు. 18 నెలల సమయం పట్టవచ్చన్నారు. ఇక ప్రాజెక్ట్ డిజైన్, డెవలప్మెంట్, అమలు, కార్యకలాపాలు, నిర్వహణను ఎల్‌టీఐమైండ్‌ట్రీ చూసుకోనున్నది. కాగా, పాన్/టాన్‌కు సంబంధించిన అంశాలన్నింటినీ సమగ్ర రీతిలో పర్యవేక్షించడానికి ఈ 2.0 ప్రాజెక్టులో లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అలాట్మెంట్, అప్డేట్స్/కరెక్షన్స్, ఆధార్-పాన్ లింకింగ్, రీ-ఇష్యూయెన్స్ రిక్వెస్ట్స్, ఆన్లైన్ పాన్ వ్యాలిడేషన్ వంటివన్నింటినీ ఒకే వేదికపై పరిశీలించి పరిష్కరించనున్నారు.
ప్రస్తుతం పాన్ సంబంధిత సేవలు మూడు వేర్వేరు వేదికల ద్వారా అందుతున్నాయి. అవే ఈ-ఫైలింగ్ పోర్టల్, యూటీఐఐటీఎస్ఎల్ పోర్టల్, ప్రొటీన్ ఈ-గవర్నెన్స్ పోర్టల్. పాన్ 2.0తో ఇవన్నీ ఒక్కటైపోనున్నాయి. అలా వచ్చే యూనిఫైడ్ పోర్టల్ ద్వారానే అన్ని సేవలు అందరికీ అందనున్నాయి. గత ఏడాది నవంబర్ 25న రూ.1,435 కోట్ల పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుత పాన్ కార్డుదారులు అప్‌గ్రేడ్ అయిన పాన్ 2.0 వ్యవస్థలో మళ్లీ కొత్తదాని కోసం దరఖాస్తు పెట్టుకోనక్కర్లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 81.24 కోట్లకుపైగా పాన్ కార్డులున్నాయి. 73 లక్షలకుపైగా టాన్లున్నాయి.