న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఐదేండ్ల కాలంలో కేంద్ర వస్తు, సేవల పన్ను (సీజీఎస్టీ) ఫీల్డ్ అధికారులు దాదాపు రూ.7.08 లక్షల కోట్ల పన్ను ఎగవేతల్ని గుర్తించారు. ఇందులో సుమారు రూ.1.79 లక్షల కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మోసాలు కూడా ఉన్నట్టు సోమవారం లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి ప్రకటించారు. ఈ ఐదేండ్లలో 91,370 పన్ను ఎగవేత కేసులు నమోదవగా, వీటిలో 44,938 కేసులు ఐటీసీ మోసాలకు సంబంధించినవే. కాగా, పన్నుల రికవరీల్లో భాగంగా జరిగిన వాలంటరీ డిపాజిట్లు రూ.1.29 లక్షల కోట్లుగా ఉన్నట్టు మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.
పన్ను ఎగవేతల్ని నియంత్రించడానికి అటు ప్రభుత్వం, ఇటు జీఎస్టీఎన్ కలిసి ఈ-ఇన్వాయిసింగ్ ద్వారా డిజిటైజేషన్ వంటి అనేక చర్యలు చేపడుతున్నాయన్నారు. మరోవైపు ఐరన్, స్టీల్ రంగంలో రూ.47.12 కోట్ల ఐటీసీ మోసాన్ని జీఎస్టీ అధికారులు గుర్తించారు. సీజీఎస్టీ ఢిల్లీ సౌత్ కమిషనరేట్ పరిధిలోని పన్ను ఎగవేతల నియంత్రణ అధికారులు ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రూ.261 కోట్ల నకిలీ ఇన్వాయిస్లతో అక్రమార్కులు ఈ మోసానికి తెగబడ్డారు. కాగా, దేశవ్యాప్తంగా జీఎస్టీ అప్పీలెట్ ట్రిబ్యునల్ బెంచీలు పనిచేసేలా కృషి చేయాలని, నిర్దిష్ట వ్యవధిలో దీన్ని పూర్తిచేసేందుకు అన్ని రాష్ర్టాలతో ముందుకెళ్లాలని కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది.