5జీకి గ్రీన్‌సిగ్నల్
- 4.31 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ సేల్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
- జూలై 26 నుంచి వేలం మొదలు
- అమ్మకానికి 72 గిగాహెట్జ్లపైనే
న్యూఢిల్లీ, జూన్ 15: దేశీయ టెలికం రంగంలో మరో సరికొత్త టెక్నాలజీ సందడి మొదలు కానున్నది. కేంద్ర క్యాబినెట్ 5జీ స్పెక్ట్రమ్ వేలానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది మరి. వచ్చే నెలాఖర్లో జరగనున్న ఈ మెగా సేల్‌లో రూ.4.31 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెట్జ్లకుపైగా ఐదో తరం (5జీ) రేడియో తరంగాలను అమ్మకానికి పెట్టనున్నారు. జూలై 26 నుంచి ఈ స్పెక్ట్రమ్ వేలం మొదలవుతుందని సంబంధిత అధికార వర్గాలు బుధవారం తెలియజేశాయి. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాయి. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ సిఫార్సు చేసిన రిజర్వ్ ధరల వద్ద ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనున్నట్టు సదరు వర్గాలు పీటీఐకి తెలిపాయి. మొబైల్ సర్వీసుల కోసం 5జీ స్పెక్ట్రమ్ వేలానికి రిజర్వ్ లేదా ఫ్లోర్ ధరలో దాదాపు 39 శాతం తగ్గించి ట్రాయ్ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే ప్రస్తుత 13, 15, 18, 21 గిగాహెట్జ్ బ్యాండ్లలో సంప్రదాయ మైక్రోవేవ్ బ్యాక్‌హాల్ క్యారియర్ల సంఖ్యను రెట్టింపు చేయాలనీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
నేరుగా కేటాయించవద్దు
గూగుల్ వంటి భారీ టెక్ కంపెనీలు మెషీన్-టు-మెషీన్ కమ్యూనికేషన్స్, ఐవోటీ, ఏఐ తదితర అప్లికేషన్ల కోసం స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే దీన్ని టెలికం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో వ్యాపారపరమైన సమస్యలు తలెత్తుతాయని, పైగా ప్రభుత్వ ఆదాయానికీ గండి పడుతుందని చెప్తున్నాయి. కాబట్టి 5జీ స్పెక్ట్రమ్ కావాలనుకునేవారు వేలంలో పాల్గొనాల్సిందేనని టెల్కోలు అంటున్నారు. కాగా, నేరుగా స్పెక్ట్రమ్ కేటాయింపులపై ట్రాయ్ సూచించిన ధర, ఇతరత్రా విధివిధానాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటామని నోటీస్ ఇన్వైటింగ్ ఆఫీసర్ తెలిపారు. 5జీ స్పెక్ట్రమ్ కోసం భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా టెలికం సంస్థలు, గూగుల్ వంటి టెక్నాలజీ కంపెనీలు పోటీపడుతున్నాయి. టెలికం శాఖ డాక్యుమెంట్ ప్రకారం ఈ నెల 20న ప్రీ-బిడ్ కాన్ఫరెన్స్ ఉండగా, వచ్చే నెల 8 దరఖాస్తుకు చివరి తేదీ. జూలై 18న ప్రీ-క్వాలిఫికేషన్ బిడ్డర్ల పరిశీలన, 22, 23 తేదీల్లో మాక్ యాక్షన్లుంటాయి.
9 ఫ్రీక్వెన్సీల్లో అమ్మకాలు
రాబోయే 5జీ వేలంలో మొత్తం 9 ఫ్రీక్వెన్సీల్లో 72,097.85 మెగాహెట్జ్‌ల స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి పెట్టనున్నారు. లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 600, 700, 800, 900, 1800, 2100, 2300 మెగాహెట్జ్ల్లో, మిడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 3300 మెగాహెట్జ్‌లో, హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 26 గిగాహెట్జ్లో తరంగాలను వేలం వేయనున్నారు. ఈ వేలం చెల్లుబాటు కాలం 20 ఏండ్లుగా ఉన్నది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి స్పెక్ట్రమ్ వేలంలో విజేతలకు తప్పనిసరి ముందస్తు చెల్లింపులను తొలగించారు. చెల్లించాల్సిన మొత్తాలను సమానంగా 20 సులభ వార్షిక వాయిదా పద్ధతుల్లో చెల్లించవచ్చు. ప్రతీ ఏడాది ఆరంభంలో ఈ చెల్లింపులను చేయాల్సి ఉంటుంది. దీనివల్ల టెలికం సంస్థలపై భారం తగ్గుతుందన్నది కేంద్రం వాదన.
4జీ కంటే 10 రెట్లు స్పీడ్
ఇప్పుడున్న 4జీ కంటే 5జీలో ఇంటర్నెట్ స్పీడ్ దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. డౌన్లోడ్, అప్లోడ్ క్షణాల్లో జరిగిపోతాయి. వీడియో, ఆడియోల నాణ్యత కూడా పెరుగుతుంది. హై ఫ్రీక్వెన్సీ హెచ్డీలో సేవలను వినియోగదారులు పొందవచ్చు. వ్యాపారులకూ ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. 5జీ రాకతో ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలూ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
సెప్టెంబర్‌లో సేవలు
భారతీయ టెలికం రంగంలో 5జీ స్పెక్ట్రమ్ వేలంతో ఓ నవ శకం మొదలవుతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా సేవలు మొదలు కావ చ్చు. ప్రైవేట్ క్యాపిటీవ్ నెట్వర్క్స్ ఏర్పాటు, అభివృద్ధికి దోహదం చేయాలనీ నిర్ణయించాం. ఆటోమోటివ్, హెల్త్‌కేర్, వ్యవసాయం, ఎనర్జీ తదితర రంగాల్లో మెషీన్ టూ మెషీన్ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధస్సు వంటి కొత్త తరం ఇండస్ట్రీ అప్లికేషన్లకు మెరుగైన అవకాశాలుంటాయి.
-అశ్వినీ వైష్ణవ్, కేంద్ర టెలికం, సమాచార శాఖ మంత్రి
ధర ఎక్కువే
అటు పరిశ్రమకు, ఇటు వినియోగదారులకు 5జీ టెక్నాలజీ రాక లాభదాయకమే అయినా స్పెక్ట్రమ్ ధర ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే పదేండ్ల తర్వాత స్పెక్ట్రమ్‌ను సరెండర్ చేసే వీలుండటం టెలికం రంగానికి కొంత కలిసొచ్చే అంశమే. మిగిలిన పదేండ్లకు చెల్లింపులూ చేయాల్సిన అవసరం లేకపోవడం గొప్ప ఊరటగానే చెప్పుకోవచ్చు.
-మార్కెట్ నిపుణులు
రూ.లక్ష కోట్లు
రాబోయే 5జీ వేలంలో టెలికం సంస్థలు రూ.1-1.1 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసే వీలున్నది. అధిక స్పెక్ట్రమ్ ధరలపై ఆందోళనలున్నా.. పరిశ్రమలో పోటీ దృష్ట్యా కొనేందుకే కంపెనీలు మొగ్గు చూపుతాయనిపిస్తున్నది. అయితే ఈ తరహా వైఖరితో టెల్కోలపై ఇప్పటికే ఉన్న రుణ భారం మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. వచ్చే మార్చి నాటికి యూజర్ సగటు ఆదాయం రూ.170కి పెరగవచ్చు.
-రేటింగ్ ఏజెన్సీ ఇక్రా
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- 4G
- 5G
- Ashwini Vaishnav
- Microwave
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

