UltraTech Cement | దేశంలోకెల్లా అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్ సిమెంట్ (UltraTech Cement) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో షాక్ ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే 36 శాతం నికర లాభాలు తగ్గిపోయాయి. ఆపరేషన్ల ద్వారా ఆదాయం పడిపోయిందని ఆల్ట్రాటెక్ సిమెంట్ వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభాలు రూ.820 కోట్లకు పరిమితమైందని పేర్కొంది. సంస్థ ఆదాయం గతేడాదితో పోలిస్తే 2.4 శాతం తగ్గి రూ.15,634.73 కోట్లకు పడిపోయిందని తెలిపింది. ఆదాయం సమకూర్చుకోవడంలో మార్కెట్ వర్గాలను అధిగమించినా నికర లాభాల్లో మాత్రం మిస్ అయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నికర లాభం 52 శాతానికి, ఆదాయం 13 శాతానికి పడిపోయాయి.
ఎడతెరిపి లేని వర్షాలు కుస్తున్నా గతేడాది సేల్స్ 68 శాతం పెరిగాయని ఆల్ట్రాటెక్ సిమెంట్ తెలిపింది. ఇంధన వ్యయం 14 శాతం తగ్గింది. ఫ్లైయాష్, స్లాగ్ కాస్ట్ పెరిగితే, ముడి సరుకు ఖర్చు తగ్గిందని తెలిపింది. ఇక ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్ విలువ 0.91 శాతం నష్టంతో ముగిసింది. ఆదాయం తగ్గుతుందన్న అంచనాల మధ్య షేర్ నష్ట పోయింది.