న్యూఢిల్లీ, ఆగస్టు 7 : బంగారం భగ..భగమండుతున్నది. దేశీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రప్ మరో 25 శాతం సుంకాన్ని విధించనున్నట్టు ప్రకటించడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. దీంతో తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు చుక్కలను అంటుకున్నాయి. దేశ రాజధాని నూఢిల్లీ బులియన్ మార్కెట్లో గురువారం ఒకేరోజు బంగారం ధర రూ.3,600 ఎగబాకింది. ఒకేరోజు ఇంతటి స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి పదిగ్రాముల పుత్తడి ధర చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,02,620కి చేరుకున్నది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తాజాగా వెల్లడించింది. అంతకుముందు ఈ ధర రూ.99,020గా ఉన్నది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర అన్ని పన్నులు కలుపుకొని రూ.3,600 ఎగబాకి రూ.1,02,200గా నమోదైంది. ఇటు హైదరాబాద్‌లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.220 అందుకొని రూ.1,02,550 పలికింది.
బంగారంతోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో కిలో వెండి రూ.1,500 ఎగబాకి రూ.1,14,000కి చేరుకున్నది. పుత్తడితోపాటు వెండి కూడా రికార్డు స్థాయికి ఎగబాకింది. ఆటు ఎంసీఎక్స్ మార్కెట్లో అక్టోబర్ నెలకుగాను రూ.893 ఎగబాకి రూ.1,02,155 పలుకగా, డిసెంబర్ నెలకుగాను రూ.880 అధికై రూ.1,03,047గా నమోదైంది. అలాగే సెప్టెంబర్ నెల డెలివరీకిగాను వెండి కాంట్రాక్ట్ ధర రూ.1,503 లేదా 1.32 శాతం ఎగబాకి రూ.1,51,158 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర బుసలుకొడుతున్నది. ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు కొడుతున్న పుత్తడి న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ ధర తొలిసారిగా 3,400 డాలర్లు దాటింది. బుధవారం పెరిగిన ధరలు..గురువారం అదే ట్రెండ్‌ను కనిపించాయి. ఔన్స్ గోల్డ్ ధర 17 డాలర్లు ఎగబాకి 3,450.30 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది. అలాగే వెండి ఔన్స్ ధర 38.34 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. మరోసారి ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపునకు మొగ్గుచూపనుండే అవకాశాలు ఉండటం కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనడంతోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉండటం కూడా ధరలు పుంజుకోవడానికి ప్రధాన కారణాలని బులియన్ వర్తకులు చెబుతున్నారు.