Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే స్టీల్, అల్యూమినియంపై దిగుమతి సుంకాన్ని (steel and aluminum tariffs) 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ తాజాగా సంతకాలు చేశారు. టారిఫ్‌లు అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 12:01 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. యూకేతో వాణిజ్య ఒప్పందం అమలులో ఉన్న నేపథ్యంలో వారికి మాత్రం టారిఫ్‌లు 25 శాతంగానే ఉండనున్నాయి.
కాగా, స్టీల్, అల్యూమినియంపై దిగుమతి సుంకాన్ని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. స్వదేశీ స్టీల్ పరిశమ్రను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం నిర్ణయం వల్ల స్థానిక స్టీల్ పరిశ్రమకు ఊతం వస్తుందని, జాతీయ సరఫరా పెరుగుతుందని, దీంతో చైనాపై ఆధారపడే సందర్భాలు తగ్గుతాయని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా స్టీల్ పరిశ్రమ అభివృద్ధి కోసం 14 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ డీల్‌కు చెందిన తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉందన్నారు. స్టీల్ పరిశ్రమలో ఇక నుంచి ఉద్యోగులు తీసివేత ఉండదని, ఔట్ సోర్సింగ్ కూడా ఉండదన్నారు. ప్రతి స్టీల్ పరిశ్రమ కార్మికుడికి 5 వేల డాలర్ల బోనస్ అదనంగా వస్తుందని పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్ చెప్పుకొచ్చారు.
Also Read..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. కూలిన 9 పాకిస్థానీ యుద్ధ విమానాలు
మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత