వాషింగ్టన్, జూన్ 3: టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి లేఆఫ్‌లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న 6 వేల (3శాతం) ఉద్యోగాలను తొలగించిన కొన్ని వారాల్లోనే, ఇప్పుడు మరికొంత మందిని తొలగిస్తున్నట్టు వెల్లడించింది. కృత్రిమ మేథ (ఏఐ) రంగంలో వస్తున్న అనూహ్య మార్పులకు అనుగుణంగా సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. వాషింగ్టన్ రాష్ట్రంలోని రెడ్మండ్ కార్యాలయంలో అదనంగా 305 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. గత నెలలో ప్రకటించిన 6,000 ఉద్యోగాల కోతకు ఇది అదనమని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. వాషింగ్టన్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కు సమర్పించిన ఫైలింగ్‌లో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని మైక్రోసాఫ్ట్ పేర్కొన్నది.