ఒమిక్రాన్, బడ్జెట్, అసెంబ్లీ ఎన్నికలపై మదుపరుల దృష్టి
ముంబై, డిసెంబర్ 30: ప్రస్తుత 2021లో ఇన్వెస్టర్లకు భారీ లాభాల్ని ఆర్జించిపెట్టిన స్టాక్ మార్కెట్‌కు కొత్త ఏడాదిలో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ద్రవ్యోల్బణం ఒత్తిడులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ కేంద్ర బ్యాంక్‌లు వడ్డీ రేట్ల పెంపునకు ఇచ్చిన సంకేతాలు, కార్పొరేట్ల క్యూ3 ఆర్థిక ఫలితాలు, కేంద్ర బడ్జెట్లో మరిన్ని సంస్కరణలు వంటి అంశాలపై ఇన్వెస్టర్లు తక్షణం దృష్టిసారిస్తున్నారని విశ్లేషకులు చెపుతున్నారు. 2020లో కొవిడ్-19 ప్రభావంతో తీవ్ర పతనానికి లోనైన తర్వాత, 2021వ సంవత్సరంలో బీఎస్ఈ సెన్సెక్స్ చరిత్రాత్మక 50,000, 60,000 శిఖరాల్ని అధిరోహించింది. మదుపరులకు ఇబ్బడి ముబ్బడిగా లాభాల్ని ఇచ్చింది. గత అక్టోబర్‌లో 62,245 పాయింట్ల రికార్డుస్థాయిని తాకిన సెన్సెక్స్ ఈ డిసెంబర్ 29 నాటికి గతేడాది చివరితో పోలిస్తే 10,055 పాయింట్లు (21 శాతం) పెరిగింది. మార్కెట్ ట్రెండ్‌పై విశ్లేషకులు ఏమంటున్నారంటే…
అంతర్జాతీయ పరిణామాలూ కీలకమే..
కొవిడ్-19 ప్రారంభ సమయంలో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఇచ్చిన ఆర్థిక ఉద్దీపనను వెనక్కు తీసుకోవడం ఇప్పటికే మొదలుపెట్టిందని, త్వరితంగా వడ్డీ రేట్లు పెంచనున్నట్లు కూడా సంకేతాలిచ్చిందని…ఈ అంశం మార్కెట్ దిశను ప్రభావితం చేయవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖెమ్కా చెప్పారు. అలాగే ఒమిక్రాన్‌తో ఏర్పడే రిస్క్ కూడా స్టాక్స్‌పై ఉంటుందన్నారు. ఇక దేశీయంగా చూస్తే కేంద్ర బడ్జెట్, ఐదు రాష్ర్టాల్లో జరగనున్న ఎన్నికల ఫలితాలు, ఫెడ్‌కు స్పందనగా రిజర్వ్‌బ్యాంక్ తీసుకునే నిర్ణయాలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నారు. చమురు ధరలు, బాండ్ ఈల్డ్స్, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, అమెరికా డాలరు కదలికలు కూడా మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయన్నారు.
ఈ రంగాలు ఉత్తమం
కొత్త ఏడాదిలో నిఫ్టీ 12-15 శాతం మేర పెరగవచ్చని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకింగ్ ఇటీవల విడుదల చేసిన ఒక నోట్లో అంచనావేసింది. 2022లో ఐటీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, రియల్ ఎస్టేట్ రంగాలు మంచి పనితీరును ప్రదర్శిస్తాయని పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటివరకూ బలహీనంగా ఉన్న బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలు..2022లో అనూహ్యంగా పుంజుకునే అవకాశాలు లేకపోలేదని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్న కరెక్షన్ చివరిదశలో ఉన్నదని, మరింత తీవ్రంగా తగ్గే అవకాశాలు లేవని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. కొత్త ఏడాదిలో క్రమేపీ మార్కెట్ ట్రెండ్ మెరుగుపడుతుందన్నారు.
సెన్సెక్స్ 71,000
ఇతర సవాళ్లలెలా ఉన్నా, కార్పొరేట్ల పటిష్ట రాబడులు మార్కెట్ ర్యాలీని నడిపిస్తాయని, వరుసగా రెండేండ్లు బలహీనపడిన వినియోగం ఊపందుకొంటున్నదని స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ ఎండీ సునీల్ న్యాతి చెప్పారు. వృద్ధి, వినియోగం పెరగడానికి బడ్జెట్లో ప్రభుత్వం చర్యల్ని తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. రిటైల్ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడులు పెడుతున్నందున, దేశీ స్టాక్ మార్కెట్..విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం రాదన్నారు. విలువలు అధికస్థాయికి చేరడం, ఒమిక్రాన్ భయాలతో ఇప్పటికే సెన్సెక్స్ ఆక్టోబర్ గరిష్ఠస్థాయి నుంచి 7 శాతం వరకూ తగ్గినందున, మార్కెట్‌కు తీవ్ర ఆందోళనలేవీ వుండవన్నారు. ఈ కారణంగా 2022 చివరికల్లా సెన్సెక్స్ 71,000 పాయింట్ల స్థాయిని, నిఫ్టీ 21,000 పాయింట్ల స్థాయిని తాకుతాయని అంచనావేశారు. దిగువస్థాయిలో సెన్సెక్స్‌కు 53,500-51,500 శ్రేణి, నిఫ్టీకి 16,000-15,500 శ్రేణి గట్టి మద్దతును అందించవచ్చని సునీల్ అంచనాల్లో పేర్కొన్నారు.