న్యూఢిల్లీ, ఆగస్టు 20: బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే తులం 24 క్యారెట్ గోల్డ్ రేటు ఏకంగా రూ.1,400 ఎగిసింది. గడిచిన నెల రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి రూ.74,150 పలికింది. సోమవారం ఇది రూ.72,750గా ఉన్నది. ఇక 22 క్యారెట్ పసిడి విలువ కూడా ఇంతే స్థాయిలో పుంజుకున్నది. ఫలితంగా 99.5 స్వచ్ఛత కలిగినది 10 గ్రాములు రూ.73,800గా ఉన్నది. మార్కెట్లో బంగారానికి స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ ఉండటం, అంతర్జాతీయంగా కూడా ఆదరణ పెరగడం.. ధరల్ని పరుగులు పెట్టిస్తున్నదని ట్రేడర్లు తాజా ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై దిగుమతి
సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో అదే రోజున రూ.3,350 క్షీణించింది. ఆ తర్వాత కూడా కొద్ది రోజులు పతనం దిశగానే పయనించింది. కానీ మళ్లీ ఇటీవలి కాలంలో ధరలు పుంజుకుంటున్నాయి. హైదరాబాద్ మార్కెట్లోనూ గోల్డ్ సేల్స్ జోష్ మీదనే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ 22 క్యారెట్ 10 గ్రాములు రూ.66,600, 24 క్యారెట్ రూ.72,650గానే ఉన్నాయి.
వెండి ధరలూ పెద్ద ఎత్తున పెరిగాయి. ఢిల్లీలో ఈ ఒక్కరోజే కిలో రేటు రూ.3,150 ఎగిసింది. దీంతో అక్కడ కేజీ సిల్వర్ విలువ రూ.87,150గా నమోదైంది. ఇక హైదరాబాద్‌లో కిలో రూ.1,000 పెరిగి రూ.92,000 మార్కును తాకింది. గ్లోబల్ మార్కెట్ విషయానికొస్తే.. ఔన్సు గోల్డ్ 18.80 డాలర్లు పెరిగి 2,560.10 డాలర్లను చేరింది. సిల్వర్ 30.19 డాలర్లుగా ఉన్నది. ‘అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరు తెన్నులు, ఇతరత్రా పరిణామాలు.. బంగారం ధరల్ని నిర్దేశిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో స్థిరంగా ఔన్సు ధర 2,500 డాలర్లపైనే పలుకుతున్నది’ అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఫ్యూచర్ మార్కెట్లో పుత్తడి ధరలు క్షీణించాయి. అంతర్జాతీయ పరిణామాలు రేట్లను ప్రభావితం చేస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ డెలివరీకిగాను మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌పై గోల్డ్ కాంట్రాక్ట్స్ రూ.71,583 పలికింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతల మధ్య అమెరికా, ఆసియా, ఐరోపా ఈక్విటీ మార్కెట్ల కదలికలు.. మదుపరులను ప్రభావితం చేస్తున్నాయంటున్నారు.