ముంబై : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు భారీగా తగ్గాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు గత వారం రోజులుగా స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. అయితే పలు రాష్ట్రాలు లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ.7 చొప్పున తగ్గించాయి. అసోం, మణిపూర్, గోవా, త్రిపుర, కర్నాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపుతోపాటు రాష్ట్రాలు కూడా కాస్త తగ్గించడంతో పెట్రోల్ పై రూ.12, డీజిల్ పై రూ.17 తగ్గింది. కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
ఈ నేపథ్యంలో గత మూడేండ్లలో మొదటిసారి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో చాలాచోట్ల డీజిల్ ధరలు రూ.100 దిగువకు వచ్చాయి. పెట్రోల్ ధరలు కూడా కాస్త తగ్గాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 103.97, లీటర్ డీజిల్ ధర 86.67, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 109.98, డీజిల్ ధర 94.14, చెన్నైలో పెట్రోల్ ధర 101.40, డీజిల్ ధర 91.43, కోల్కతాలో పెట్రోల్ ధర 104.67, డీజిల్ ధర 89.79, భోపాల్లో పెట్రోల్ ధర 112.56, డీజిల్ ధర 95.40, హైదరాబాద్లో డీజిల్ రూ.94.62, లీటర్ పెట్రోల్ రూ.108.20గా ఉంది. అయితే ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
ఎక్కడెక్కడ ఎంత..?
ఉత్తర ప్రదేశ్, గోవా, కర్నాటక దారిలో పంజాబ్ నడిచింది. ఇక్కడ పెట్రోల్ పైన రూ.10, డీజిల్ పైన రూ.5 తగ్గించింది. ఢిల్లీతో పోలిస్తే పంజాబ్లో ఇప్పుడు పెట్రోల్ ధర రూ.9 తక్కువ. పంజాబ్లో ఇప్పుడు లీటర్ పెట్రోల్ రూ.95.63, లీటర్ డీజిల్ రూ.84.42గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా నాలుగైదు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వ్యాట్ ఎక్కువగా విధిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. వీటి కంటే ముందు రాజస్థాన్, మహారాష్ట్ర ఉన్నాయి. రాజస్థాన్లో లీటర్ పెట్రోల్ రూ.111.10, మహారాష్ట్రలో రూ.109.98, ఆంధ్రప్రదేశ్ రూ.109.05, తెలంగాణ రూ.108.10గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తున్నది.