SBI | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధిచెందుతున్నదంటూ ప్రధాని, ఆర్థికమంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారు.. ఒక్కరేమిటి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ ఊదరగొడుతుంటే మరోవైపు తాజా అధికారిక గణాంకాల్ని విశ్లేషిస్తూ దేశీ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విభాగమైన ఎస్బీఐ రీసెర్చ్ నిర్ఘాంతపోయే నివేదికను విడుదల చేసింది. దేశంలో కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయన్నది ఈ రిపోర్ట్ సారాంశం. కేవలం రెండేండ్లలోనే కుటుంబాల రుణం రెట్టింపు అయ్యిందని, పొదుపు మాత్రం సగానికిపైగా పడిపోయిందని ఎస్బీఐ రిసెర్చ్ వెల్లడించింది.
రిజర్వ్‌బ్యాంక్ సైతం ఈ వారంలో ఒక బులిటిన్ విడుదల చేస్తూ 2022లో జీడీపీలో 7.2 శాతం ఉన్న కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 2023 ఆర్థిక సంవత్సరంలో ఐదు దశాబ్దాల కనిష్ఠస్థాయి 5.1 శాతానికి తగ్గినట్టు తెలిపింది. ఏడాదికాలంగా కుటుంబాల ఆర్థిక రుణాలు మాత్రం జీడీపీలో 3.8 శాతం నుంచి 5.8 శాతానికి చేరాయి.
ప్రభుత్వ సాధారణ ఖర్చులకు, ఇతర నాన్-ఫైనాన్షియల్ కార్పొరేషన్ల వ్యయాలకు ప్రధానంగా ప్రజల పొదుపే ఆధారం. పొస్టాఫీసుల్లో జరిగే చిన్న మొత్తాల పొదుపును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే వాడుకుంటుంది. డిపాజిట్లలో వచ్చే నిధుల్లో కొంత శాతాన్ని బ్యాంక్‌లు ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడానికే ఉపయోగిస్తాయి. ఆ బాండ్ల జారీ ద్వారా ప్రభుత్వం నిధుల్ని సమీకరించుకుంటుంది. నాబార్డ్ తదితర వ్యవసాయ సంబంధిత, పీఎఫ్సీ తదితర వ్యవసాయేతర సంస్థలు, ఎన్జీవోలు బాండ్ల జారీ ద్వారా పొదుపు నిధుల్నే పొందుతాయి.