హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రామగుండంలో కొత్తగా నిర్మించతలపెట్టిన థర్మల్ పవర్‌ప్లాంట్ విషయంలో జాయింట్ వెంచర్ విధానానికే రాష్ట్ర సర్కారు సై అన్నది. విద్యుత్తు ఉద్యోగులు, కార్మికులు ఎంతగా వ్యతిరేకించినా సింగరేణి సంస్థతో జట్టుకట్టేందుకు సిద్ధపడింది. సింగరేణి సంస్థ భాగస్వామ్యంతో రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్‌ప్లాంట్‌ను నిర్మించనున్నది. సింగరేణి, టీజీ జెన్కో సంయుక్తంగా ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నాయి.
ఈ ప్లాంట్ నిర్మాణంపై టీజీ జెన్కో, సింగరేణి సంస్థలు వారంలోగా విధివిధానాలు ఖరారుచేయాలని, నెలలోగా డీపీఆర్‌ను రూపొందించి సమర్పించాలని ప్రభుత్వం ఆయా సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్.. టీజీజెన్కో, సింగరేణి సంస్థల సీఎండీలకు శనివారం లేఖలు రాశారు. రాష్ట్రంలో విద్యుత్తు ప్లాంట్లను జెన్కో ద్వారానే నిర్మించి చేపడుతున్నారు. ఇప్పటివరకు 6,485 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను జెన్కో నిర్మించగా, ఇప్పుడు పవర్ప్లాంట్ల నిర్మాణంలో కొత్తగా జాయింట్‌వెంచర్ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిసారి సింగరేణి సంస్థకు భాగస్వామ్యం కల్పిస్తున్నది.
విధివిధానాలు, డీపీఆర్ తయారీ పూర్తికాగానే రెండు సంస్థల మధ్య ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. కాగా, సింగరేణి సంస్థ భాగస్వామ్యాన్ని విద్యుత్తు ఉద్యోగ, కార్మిక సంఘాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేర కు పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రాలు అందజేశారు. అయినా ప్రభుత్వం జాయింట్ వెంచర్ విధానానికే మొగ్గుచూపడం గమనార్హం.