ముంబై, నవంబర్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ వార్తలు వచ్చినప్పటికీ ఐటీ, టెక్నాలజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు కదంతొక్కాయి. అమెరికా ద్రవ్యోల్బణం అంచనావేసినస్థాయిలో నమోదవడం, బాండ్ ఈల్డ్ రేట్లు ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేకపోవడంతో ఒక దశలో 66 వేల పాయింట్ల పైకి చేరుకున్న సెన్సెక్స్ చివరకు 306.55 పాయింట్లు ఎగబాకి 65,982.48 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 89.75 పాయింట్లు అందుకొని 19,765.20 వద్ద నిలిచింది. దేశీయ టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ నెల 25న బైబ్యాక్ ప్రకటించింది.
ఎఫ్‌పీఐల పెట్టుబడి విలువ రూ.54 లక్షల కోట్లు
భారత్ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడి విలువ సెప్టెంబర్ త్రైమాసికంలో 15 శాతం పెరిగి 651 బిలియన్ డాలర్లకు (రూ.54.16 లక్షల కోట్లు) చేరింది. ముగిసిన త్రైమాసికంలో ఎఫ్‌పీఐల నికర కొనుగోళ్లు పెరగడం, ఈక్విటీ మార్కెట్ మంచి పనితీరును కనపర్చడంతో నిరుడు ఇదే త్రైమాసికంలో 566 బిలియన్ డాలర్లుగా ఉన్న పెట్టుబడులు 651 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు మార్నింగ్‌స్టార్ విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది.
క్యూ1తో పోలిస్తే 626 బిలియన్ డాలర్ల నుంచి 4 శాతం పెరిగినట్టు తెలిపింది. అయితే భారత ఈక్విటీ మార్కెట్ విలువలో ఎఫ్‌పీఐల వాటా 17.33 శాతం నుంచి 16.95 శాతానికి తగ్గిందన్నది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో 5.38 బిలియన్ డాలర్ల మేర నికర కొనుగోళ్లు జరిపారని వెల్లడించింది. అయితే ఆరు నెలల్లో తొలిసారిగా సెప్టెంబర్ నెలలో మాత్రం 1.78 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్‌ను నికరంగా విక్రయించారన్నది. యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం ఇందుకు కారణమని మార్నింగ్ స్టాక్ వివరించింది. అక్టోబర్‌లో 2.95 బిలియన్ డాలర్ల విక్రయాలు జరపగా, నవంబర్ 10 వరకూ 697 మిలియన్ డాలర్ల నిధుల్ని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు.