ముంబై, డిసెంబర్ 11: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతున్నది. ఇప్పటికే ఆల్‌టైమ్ కనిష్ఠాల వద్ద కదలాడుతున్న దేశీయ కరెన్సీ.. గురువారం మరింత దిగజారి మునుపెన్నడూలేని స్థాయికి క్షీణించింది. 38 పైసలు నష్టపోయి ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద 90 మార్కుకు ఎగువన 90.32 దగ్గర నిలిచింది. దీంతో ఈ నెల 3న నమోదైన 90.15 ఆల్‌టైమ్ లో రికార్డు కనుమరుగైపోయింది. ఇక ఒకానొక దశలోనైతే దిగుమతిదారుల నుంచి డాలర్లకు విపరీతమైన డిమాండ్ రావడంతో రూపీ వాల్యూ ఏకంగా 90.48 స్థాయికి దిగజారింది. తిరిగి కోలుకోవడంతో ఫారెక్స్ ట్రేడర్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంట్రా-డేలో ఇదే రికార్డు కనిష్ఠం. ఈ నెల 4న 90.43 స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే.
రూపాయి పతనం.. దేశ ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేస్తుంది. అన్ని విదేశీ దిగుమతులు భారమైపోతాయి. దీనివల్ల అటు ద్రవ్యోల్బణం విజృంభించడమేగాక, ఇటు దేశంలోని డాలర్ నిల్వలూ కరిగిపోతాయి. విదేశీ వాణిజ్యం మొత్తం ప్రపంచ కరెన్సీగా ఉన్న అమెరికా డాలర్లలోనే జరుగుతుంది మరి. అందుకే దిగుమతిదారుల నుంచి డాలర్లకు అంత డిమాండ్. వాస్తవానికి రూపాయి నష్టాల దృష్ట్యా ఆయా దేశాలతో స్థానిక కరెన్సీల్లో వ్యాపారానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పావులు కదుపుతున్నది.
కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండటం లేదు. ఇక ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాలు 85 శాతానికిపైగా విదేశాల నుంచి చేసుకుంటున్న ముడి చమురు దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఈ క్రమంలో రూపాయి బలహీనత క్రూడాయిల్‌ను ఖరీదెక్కిస్తుంది. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు క్రూడ్ ధరలు గతంతో పోల్చితే తక్కువగానే ఉన్నాయి. కానీ కేవలం రూపీ నష్టం కారణంగా అధికంగా చెల్లించాల్సి వస్తున్నది. ఒక్క క్రూడాయిల్ విషయంలోనే కాదు.. దిగుమతయ్యే మిగతా అన్ని వస్తూత్పత్తులదీ ఇదే దుస్థితి. పరిస్థితులు ఇలాగే ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావమే పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రూపాయి సెగ సగటు భారతీయునికి గట్టిగానే తగులుతున్నది. ముఖ్యంగా వంటింటి బడ్జెట్ తారుమారవుతున్నది. పప్పులు, ఉప్పులు, నూనె, సబ్బులు ఇలా అన్నింటి ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి. ఇక ఆర్బీఐ మళ్లీ కఠిన ద్రవ్య వైఖరిని అవలంబిస్తే వడ్డీరేట్లు పెరుగడం ఖాయం. ఇదే జరిగితే రుణ లభ్యత కఠినమై ఆయా రంగాల్లో సమస్యలు తప్పవని చెప్తున్నారు. మొత్తానికి రూపాయి బలపడకపోతే మున్ముందు భారత్‌కు తిప్పలేనని చెప్పకతప్పదు.