ముంబై, ఫిబ్రవరి 3: రూపాయి జిగేల్.. జిగేల్‌మన్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం ఒకేరోజు 117 పైసలు ఎగబాకింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 117 పైసలు లేక 1.28 శాతం బలపడి 90.32 వద్ద ముగిసింది. ఆసియా కరెన్సీల్లో అత్యంతగా బలపడ్డ కరెన్సీ రూపాయి కావడం విశేషం. భారత్-అమెరికా దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో రూపాయి దూసుకుపోయిందని, గడిచిన రెండు నెలల్లో ఒకేరోజు ఇంతటి స్థాయిలో పెరగడం ఇదే తొలిసారని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లు బలోపేతం కావడం కూడా రూపాయికి మరింత కిక్కునిచ్చిందన్నారు.
వీటికి తోడు క్రూడాయిల్ ధరలు బలహీనంగా ఉండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందన్నారు. 90.30 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 90.05 గరిష్ఠ స్థాయిని తాకగా, ఒక దశలో 90.52 కనిష్ఠ స్థాయిని కూడా తాకింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 117 పైసలు ఎగబాకి 90.32 వద్ద స్థిరపడింది. సోమవారం కూడా రూపాయి విలువ 44 పైసలు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో గడిచిన రెండు రోజుల్లో 161 పైసలు పెరిగినట్టు అయింది.