ముంబై, ఫిబ్రవరి 7: వడ్డీరేట్లను తగ్గిస్తూ రిజర్వుబ్యాంక్ తీసుకున్న నిర్ణయం మదుపరులకు హుషారివ్వలేదు. మరోవైపు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను తరలించుకుపోతుండటంతో దేశీయ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టాల్లోనే కొనసాగాయి. ఒక దశలో 600 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 78 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 197.97 పాయింట్లు కోల్పోయి 77,860.19 వద్ద ముగిసింది.
మరో సూచీ నిఫ్టీ సైతం 43.40 పాయింట్లు కోల్పోయి 23,559.95 వద్ద స్థిరపడింది. నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో ఐటీసీ షేరు 2 శాతానికి పైగా పడిపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టపోయాయి.
అలాగే నెస్లె, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, బజాజ్‌ఫైనాన్స్, టాటా మోటర్స్, హెచ్‌యూఎల్, మారుతి, యాక్సిస్ బ్యాంక్ షేర్లు పడిపోయాయి. కానీ, టాటా స్టీల్, ఎయిర్టెల్, జొమాటో, మహీంద్రాఅండ్‌మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, కొటక్ బ్యాంక్, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి.