న్యూఢిల్లీ, జూలై 2: ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో వాటాల విక్రయం విషయంలో మోదీ సర్కార్ దూకుడు పెంచింది. గత కొన్నేండ్లుగా బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలకు దూరంగానే నిధుల సమీకరణ పరిమితమవుతుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం ఎలాగైనా టార్గెట్‌ను పూర్తి చేయాలన్న దృష్టితో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఈ క్రమంలోనే గడిచిన 3 నెలల్లోనే పెట్టుకున్న లక్ష్యంలో 31 శాతం సాధించింది. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకం, ఆస్తుల నగదీకరణ ద్వారా రూ.80,000 కోట్లను ఖజానాకు తరలించాలని ఈ ఏడాది పార్లమెంట్లో ప్రకటించిన వార్షిక బడ్జెట్లో కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దాదాపు రూ.25,000 కోట్ల నిధులను సమీకరించింది.
ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో ఉన్న 6 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.18,561 కోట్లను కేంద్ర ప్రభుత్వం పొందింది. గడిచిన 6 వారాల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్ఎల్సీ ఇండియా, జీఐసీ, ఐఆర్ఎఫ్సీల్లో వాటాలను కొంతమేర అమ్మేసింది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) కింద ఆస్తుల నగదీకరణతో మరో రూ.6,367 కోట్లను అందుకున్నది. ఇలా మొత్తం రూ.24,928 కోట్లను పొందింది.
ఇప్పటిదాకా ఏ ఆర్థిక సంవత్సరంలోనూ తొలి త్రైమాసికంలోనే ఈ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణలు జరుగలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తుండటం గమనార్హం. దీంతో ఇదే వేగంతో వెళ్తే.. చాలా ఏండ్ల తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం పీఎస్‌యూ వాటాల విక్రయానికి పెట్టుకున్న లక్ష్యాన్ని ఛేదించగలమన్న దీమా కేంద్రంలో వ్యక్తమవుతున్నది. మోదీ హయాంలో 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యాన్ని మించి పెట్టుబడుల ఉపసంహరణలు జరిగాయి. అయితే ఆ తర్వాత సంవత్సరాల నుంచి సీన్ మారింది. కరోనా, ఆర్థిక మందగమనం, యుద్ధాలు.. ఇలా అనేకానేక దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితులతో అప్పట్నుంచి ఇప్పటిదాకా లక్ష్యసాధన లేనేలేదు.
సర్కారీ సంస్థల్లో ఈ వాటాల విక్రయం ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆయా శాఖల ఉన్నతాధికారులు వారానికోసారి సమావేశం కూడా అవుతున్నారు. మార్కె ట్ పరిస్థితులు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల దగ్గర్నుంచి రిటైల్ ఇన్వెస్టర్ల డిమాండ్దాకా అన్నింటినీ పరిశీలిస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం తగ్గుముఖం పట్టడటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇటీవలికాలంలో వరుస లాభాలను పొందుతున్నది చూస్తూనే ఉన్నాం. దీంతో చాలా కంపెనీలు ఐపీవోలకు రంగం సిద్ధం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే సర్కారీ సంస్థల్లో వాటాల విక్రయం జోరు పెంచితే లాభదాయకం అన్న అభిప్రాయం ఉన్నది. దీంతో అన్ని పీఎస్‌యూల పనితీరుపై కన్నేస్తున్న అధికారులు.. పబ్లిక్ ఇష్యూలకు వాటిని లైన్లో పెడుతున్నారు. పైగా గల్ఫ్ వార్తో పెరిగిన ముడి చమురు ధరల వల్ల ఎగిసిన ప్రభుత్వ ఖర్చులు, రాయితీల భారం దృష్ట్యా కూడా నిధుల సమీకరణను వేగిరం చేయాలని కేంద్రం చూస్తున్నది. పన్నేతర ఆదాయం పెంపునకున్న అన్ని మార్గాలనూ పరిశీలిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. పీఎస్‌యూల్లో వాటాల ఉపసంహరణలపైనా ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, మరికొన్నింటిలో వాటాల అమ్మకంపై సర్కార్ ప్రణాళికలు వేస్తున్నది. ఎల్ఐసీలో కేంద్రానికి ఇప్పుడు 96.5 శాతం వాటా ఉన్నది. దీన్ని వచ్చే ఏడాది మే నాటికి 90 శాతం దిగువకు తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆఖర్లోగా 3-4 శాతం వాటా అమ్మకానికి రావచ్చన్న అంచనాలున్నాయి. త్వరలోనే రూ.10,000 కోట్ల విలువైన వాటాను విక్రయించవచ్చని తెలుస్తోంది.
హిందుస్థాన్ జింక్‌లో వాటాల విక్రయం ద్వారా మరో రూ.5,000 కోట్లు రాబట్టాలని చూస్తున్నట్టు బ్లూంబర్గ్ చెప్తున్నది. ఎప్పట్నుంచో ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నా.. కుదరకుండా ఉన్న ఐడీబీఐ బ్యాంక్‌లోనూ వ్యూహాత్మక వాటాల విక్రయంపై కసరత్తులు జరుగుతున్నాయి. ఇక 2022 మే నెలలో ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను అమ్మి కేంద్రం రూ.20,500 కోట్లను సమీకరించిన విషయం తెలిసిందే.
మోదీ హయాంలో ప్రభుత్వ సంస్థల్లోవాటాల ఉపసంహరణలు (రూ.కోట్లలో)
