న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశ ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్నది. జనవరిలో 3 నెలల గరిష్ఠాన్ని తాకుతూ వాణిజ్య లోటు 34.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈసారి ఎగుమతులు స్వల్పంగా 0.61 శాతం పెరిగి 36.56 బిలియన్ డాలర్లుగా ఉంటే.. దిగుమతులు మాత్రం 19.2 శాతం ఎగిసి 71.24 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఇది వాణిజ్య లోటును ఎగదోసింది. ఇక అధిక ధరల నేపథ్యంలో దిగుమతుల్లో బంగారం, వెండి వాటా గణనీయంగా పెరిగి వరుసగా 12 బిలియన్ డాలర్లు, 2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ముడి చమురు దిగుమతులు 0.24 శాతం తగ్గి 13.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
అమెరికాకు భారతీయ ఎగుమతులు గత నెలలో 21.77 శాతం క్షీణించాయి. 6.6 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. అగ్రరాజ్యం విధించిన అధిక సుంకాల ప్రభావం కనిపించింది. సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలల్లోనూ పతనం చూసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే అమెరికా నుంచి భారత్కు జరిగిన దిగుమతులు 23.71 శాతం పెరిగి 4.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.