ముంబై, డిసెంబర్ 12: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. ద్రవ్యోల్బణ గణాంకాలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 377.50 పాయింట్లు తగ్గి 69,551.03 వద్ద స్థిరపడింది.
చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న నిఫ్టీ చివరకు 21 వేల దిగువకు పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 90.70 పాయింట్లు కోల్పోయి 20,906.40 వద్ద ముగిసింది. సూచీలు కన్సాలిడేషన్ స్థాయిలో ఉన్నాయని, ముఖ్యంగా నవంబర్ నెలకుగాను రిటైల్ ధరల సూచీ గణాంకాలు విడుదలకానుండటంతో మదుపరులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అమ్మకాలకు మొగ్గుచూపారు..ఫలితంగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సూచీలు యూ-టర్న్ తీసుకున్నాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.