Indian Rupee | ముంబై, జనవరి 28 : రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించింది. మంగళవారం ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే మరో 26 పైసలు పడిపోయి 86.57 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల భయం.. అంతర్జాతీయ మార్కెట్‌ను ఆవరించడంతో కరెన్సీ మార్కెట్‌పై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
మరోవైపు చమురు దిగుమతిదారుల నుంచి వస్తున్న డిమాండ్‌తో బలపడుతున్న డాలర్కుతోడు, భారతీయ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు తరలిపోతుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నాయి. ఈ ఒక్కరోజే ఎఫ్ఐఐలు రూ.4,920.69 కోట్ల పెట్టుబడుల్ని దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నారు. సోమవారం కూడా రూపాయి మారకం విలువ 9 పైసలు దిగజారిన విషయం తెలిసిందే. ఇదే రోజు రూ.5,015. 46 కోట్ల ఎఫ్ఐఐ పెట్టుబడులు తరలిపోయాయి.