హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో భూముల ధరలు గరిష్ఠంగా 12 శాతం పెంచారు. వచ్చే ఏడాది మార్చి వరకు పెరిగిన రేట్లు అమల్లో ఉంటాయని టీజీఐఐసీ జూరీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ సమీపంలోని పారిశ్రామిక వాడల్లో భూముల ధరలు అందుబాటులో లేవనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో టీజీఐఐసీ మళ్లీ భూముల ధరలు పెంచడంపై పరిశ్రమ వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగంతోపాటు పారిశ్రామిక రంగం సైతం నేలచూపులు చూస్తున్న విషయం తెలిసిందే. తక్కువ ధరలకే భూములంటూ పొరుగు రాష్ర్టాల నుంచి వెల్లువెత్తుతున్న పోటీ ఒకవైపైతే.. సబ్సిడీలు రావడం లేదనే కారణం మరోవైపు. అన్నీ వెరసి రాష్ట్రంలో దాదాపు గత ఏడాదిన్నర కాలంగా పారిశ్రామిక రంగం స్తబ్ధుగా ఉన్నది. ఈ నేపథ్యంలో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయిస్తున్న భూముల ధరలను గణనీయంగా పెంచింది. సైబరాబాద్, శంషాబాద్, పటాన్‌చెరూ, యాదాద్రి, మేడ్చల్-సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం తదితర జోన్ల పరిధిలోని ఇండస్ట్రియల్ పార్క్‌లలో 12 శాతం వరకూ ధరలు పెంచారు. దీంతో పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకున్నట్టేనని ఇండస్ట్రీ వర్గాలు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
బహిరంగ మార్కెట్లోనే చౌక
బహిరంగ మార్కెట్లోని వ్యవసాయ భూములతో పోల్చుకుంటే టీజీఐఐసీ పారిశ్రామిక వాడల్లో నిర్ణయించిన ధరలు ఎంతో ఎక్కువగా ఉండడం గమనార్హం. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని గద్వాలలో ఎకరం భూమి రూ.1.10 కోట్లు, ఆదిభట్లలో రూ.5 కోట్లు, సీతారాంపూర్, చందన్వల్లిలో రూ.3 కోట్లు, పటాన్‌చెరూలో రూ.6 కోట్లు, రామగుండంలో రూ.4.5 కోట్లు, నిజామాబాద్‌లో రూ.6.3 కోట్లుగా ధర నిర్ణయించారు. రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడంతో ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం భూములు కొనేవారే కరువయ్యారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్‌తో సంబంధం లేకుండా ధరలు నిర్ణయించడం సమంజసం కాదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం రోడ్లు, విద్యుత్తు సౌకర్యం కల్పించి ధరలు అమాంతం పెంచితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.
పొరుగు రాష్ర్టాలతో పోటీ ఎలా…?
పెద్ద ఎత్తున పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తూ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలను ప్రకటిస్తున్నది. స్వరాష్ర్టానికి తరలిరావాలని అక్కడి సర్కారు కోరుతున్నది. అలాగే బెంగళూరులో సైతం పారిశ్రామిక వాడల్లో భూముల ధరలు హైదరాబాద్‌తో పోల్చుకుంటే ఎంతో తక్కువగా ఉన్నాయి. అయితే తెలంగాణ తరహాలోనే కర్ణాటకలో కూడా రాయితీలు సకాలంలో విడుదల చేయడం లేదని, అయినప్పటికీ భూముల ధరలు మన రాష్ట్రంతో పోల్చుకుంటే ఎంతో తక్కువగా ఉండడం వల్ల బెంగళూరు ప్రత్యామ్నాయంగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు మన రాష్ట్రంలో భూ సేకరణకు అంతటా రైతులు తిరగపడుతుండడంతో రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయడం అత్యంత సంక్లిష్టంగా మారింది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసిన పారిశ్రామిక వాడల్లోనే మిగిలిన ప్లాట్లను ప్రస్తుతం విక్రయిస్తున్నారు.