TGIIC | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఐఐసీ) నిర్లక్ష్యం కొందరు అమాయకులకు శాపంగా మారుతున్నది. ఏండ్ల క్రితం పరిశ్రమల కోసం సేకరించిన భూములను కూడా టీజీఐఐసీ తన పేర మ్యుటేషన్ చేయించుకోకపోవటంతో నష్టపరిహారం తీసుకున్న పట్టాదార్లు తమ భూములను అమాయకులకు అంటగడుతున్నారు. భూములు కొనుగోలు చేసినవారు వాస్తవం తెలిసిన తర్వాత లబోదిబోమంటున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు లెక్కలేనన్ని ఉండొచ్చని అధికారులే అంగీకరిస్తున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం రైతుల నుంచి భూములు సేకరించి, మౌలిక సదుపాయాలు కల్పించిన అనంతరం పరిశ్రమలకు విక్రయించడం టీజీఐఐసీ బాధ్యత. రైతుల నుంచి సేకరించిన భూములను నష్టపరిహారం చెల్లించిన వెంటనే టీజీఐఐసీ పేర రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడంవల్ల పట్టాదార్లు ఇతరులకు విక్రయించే అవకాశం ఉండదు. అయితే టీజీఐఐసీకి చెందిన అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా ప్రాంతాల్లో సేకరించిన భూములు ఇంకా పట్టాదార్ల పేర్లతోనే కొనసాగుతుండటంతో వారు క్రయవిక్రయాలు జరుపుతున్నారు. దీనివల్ల కొనుగోలు చేస్తున్న అమాయకులు మోసపోతున్నారు.
ఉదాహరణకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో వివిధ సర్వే నంబర్లలో దాదాపు 20 ఏండ్ల క్రితం అప్పటి ఏపీఐఐసీ సుమారు 200 ఎకరాల భూములు సేకరించింది. అందులో పావువంతు భూముల్లోనే పరిశ్రమలు ఏర్పాటు కాగా, మిగిలిన భూములు ఖాళీగానే ఉన్నాయి. భూములు సేకరించినా వాటిని పరిశ్రమల పేరుతో గానీ, ఏపీఐఐసీ పేరుతోగానీ రిజిస్ట్రేషన్ చేయించలేదు. దీంతో ఇంకా ఆ భూములు పట్టాదార్ల పేరు మీదే ఉన్నట్టు రికార్డులు చెప్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు వాటిని మళ్లీ ఇతరులకు విక్రయించారు.
సర్వే నంబరు 81 పరిధిలో ఇటువంటి ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది. 20 ఏండ్ల క్రితం ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో ఆరు ఎకరాల భూమి ఇప్పటికే నలుగురు చేతులు మారింది. తీరా ఐదో వ్యక్తి దాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా, టీజీఐఐసీ పేర రిజిస్టర్ అయినట్టు రికార్డులు చూపుతున్నాయి. దీంతో విక్రయానికి ఉంచిన ఆ నాలుగో వ్యక్తి తాను మోసపోయానని లబోదిబోమంటున్నాడు. తాను పట్టాదారు వద్ద భూమి కొనుగోలు చేసినట్టు, తన భూమిని విక్రయించేందుకు ఎన్వోసీ ఇవ్వాలని బాధితుడు టీజీఐఐసీని వేడుకొంటున్నాడు. అధికారులు మాత్రం ఎన్వోసీ ఇచ్చే ఆస్కారం లేదని చేతులెత్తేశారు. ఆ 200 ఎకరాల భూముల్లో ఇలాంటి ఇంకా ఎన్ని ఉన్నాయో తేలాల్సి ఉన్నది.
పారిశ్రామిక ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలనుకొనేవారు సమగ్రంగా విచారించుకొని, స్థానికులతో మాట్లాడిన తర్వాతే భూములు కొనుగోలు చేయాలని టీజీఐఐసీ అధికారులు సూచిస్తున్నారు. సిబ్బంది కొరత వల్ల తాము సేకరిస్తున్న భూములను వెంటనే టీజీఐఐసీ పేర రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోతున్నామని, దీన్ని ఆసరాగా చేసుకొని పట్టాదార్లు నష్టపరిహారం తీసుకొని కూడా ఇతరులకు విక్రయించుకొంటున్నట్టు తెలిసిందని చెప్తున్నారు. సేకరించిన భూములను టీజీఐఐసీ పేర మ్యూటేషన్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూశాఖపై ఉంటుందని, వాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తాము చేసేదేమీ లేదని స్పష్టంచేస్తున్నారు. మొత్తంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల అమాయకులు ఎంతోమంది మోసపోతున్నారు.