TCS | దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కీలక ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా ఉద్యోగులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. స్థానిక ఉద్యోగుల నియామకాలపైనే (US workforce) దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు టీసీఎస్ (TCS) సీఈఓ కె.కృతివాసన్ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికాలోని టీసీఎస్ సంస్థలో ప్రస్తుతం సరిపడా హెచ్-1బీ ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. 32,000 నుంచి 33,000 మంది ఉద్యోగులు ఉన్నారన్నారు. అందులో దాదాపు 11 వేల మంది హెచ్-1బీ వీసాపైన వచ్చినవారేనని తెలిపారు. ఇక ఈ ఏడాది ఇప్పటికే భారత్ నుంచి దాదాపు 500 మందిని ఈ వీసాలపై అమెరికాకు పంపినట్లు వివరించారు. ఈ ఏడాది హెచ్-1బీ వీసా కింద కొత్త నియామకాలు చేపట్టే ప్రణాళిక లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎల్-1 వీసాల సదుపాయం కూడా ఉందని.. అవి హెచ్-1బీని భర్తీ చేయలేవని వెల్లడించారు.
అమెరికా (America)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసా (H1B Visa Fee) దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లకు పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ట్రంప్ చర్య భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది.భారత్‌కు చెందిన పలు దిగ్గజ సంస్థలు ఎక్కువగా హెచ్-1బీ వీసాలతోనే అమెరికాలో తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ వీసాలతోనే భారతీయుల్ని నియమించుకుంటున్నాయి. ఇందులో అమెజాన్ (Amazon) సంస్థ టాప్‌లో ఉంది. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ (TCS) రెండోస్థానంలో నిలిచింది.
యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం జూన్ నాటికి అమెజాన్ దాదాపు 10,044 హెచ్-1బీ వీసాలను ఉపయోగించింది. ఆ తర్వాత టీసీఎస్ 5,505, మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), యాపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951), ఒరాకిల్ (2,092), అమెజాన్ వెబ్ సర్వీసెస్ (2,347), కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (2,493), వాల్‌మార్ట్ అసోసియేట్స్ (2,390) హెచ్-1బీ వీసాలను దక్కించుకున్నాయి. ఇవే కాకుండా అమెరికాకు చెందిన పలు కంపెనీలు కూడా హెచ్-1బీ వీసాలతో ఎక్కువమంది భారతీయులను నియమించుకుంటున్నాయి. వాటిపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది.
Also Read..
Donald Trump | నోబెల్ శాంతి మిస్సైన వేళ.. ట్రంప్‌ను వరించిన అత్యున్నత పౌర పురస్కారం
Israeli Hostages | రెండేండ్ల తర్వాత ఇజ్రాయెల్ బందీలకు విముక్తి.. ఏడుగురిని విడుదల చేసిన హమాస్
Donald Trump | నేను యుద్ధాలు ఆపడంలో నిపుణుడిని.. ఇక పాక్-ఆఫ్ఘాన్ వార్ సంగతి చూస్తా : ట్రంప్