Donald Trump | గాజాలో గత రెండేండ్లుగా సాగుతున్న యుద్ధం ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas War) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు ఆపడంలో తాను నిపుణుడిని (Im good at solving wars) అంటూ చెప్పుకున్నారు. ఇప్పటికే ఏడు యుద్ధాలు ఆపిన తాను.. గాజాలో నేను ఆపింది ఎనిమిదో యుద్ధం అంటూ చెప్పుకొచ్చారు. ఇక పాక్-ఆఫ్ఘాన్ యుద్ధం సంగతి చూస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
డొనాల్డ్ ట్రంప్ నేడు ఇజ్రాయెల్ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడారు. భారత్-పాక్ మధ్య యుద్ధం గురించి ప్రస్తావించారు. సుంకాల బెదిరింపులు రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు సహాయపడిందని పేర్కొన్నారు. తన హయాంలో ప్రపంచంలో నెలకొన్న బహుళ వివాదాలను పరిష్కరించినట్లు చెప్పారు. వివాదాలను పరిష్కరించడంలో తనకు ఎవరూ సాటి లేరంటూ గొప్పలు చెప్పుకున్నారు. ‘ఇది (గాజాలో యుద్ధాన్ని ఉద్దేశిస్తూ) నేను పరిష్కరించిన ఎనిమిదో యుద్ధం అవుతుంది. పాక్-ఆఫ్ఘాన్ మధ్య ఇప్పుడు యుద్ధం (Afghan-Pak conflict) జరుగుతోందని నేను విన్నాను. అమెరికాకు తిరిగి వచ్చేవరకు ఆగుతాను. నేను యుద్ధాలను ఆపడంలో నిపుణుడిని’ అంటూ చెప్పుకొచ్చారు. తన దౌత్య ప్రయత్నాల లక్ష్యం ప్రజల ప్రాణాలు కాపాడటమేనని అన్నారు. అవార్డుల కోసం ఇదంతా చేయట్లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Donald Trump | ఇజ్రాయెల్‌కు బయల్దేరి వెళ్లిన ట్రంప్.. గాజాలో యుద్ధం ముగిసిందంటూ ప్రకటన
శాంతి శాశ్వతమయ్యేనా?.. బందీల విడుదలపై సర్వత్రా ఎదురుచూపులు