టెల్ అవీవ్, అక్టోబర్ 12: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలు ప్రారంభం కావడంతో ప్రపంచ నేతలు ఈజిప్ట్‌లో జరిగే గాజా శాంతి సదస్సు శిఖరాగ్ర సమావేశానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇందులో హమాస్ పాల్గొనడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదన, ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్‌తో 20 అంశాల ప్రణాళికకు పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ అంగీకరించడంలో రెండు రోజుల క్రితమే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ప్రారంభమైంది. ఇక హమాస్ పరంగా గాజా స్ట్రిప్ పాలన అనేది ముగిసిన అంశం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసిల అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం గాజా శాంతి ఒప్పందం జరగనుంది.
గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ముగించి, శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సహా 20కి పైగా దేశాల నాయకులు హాజరవుతున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని పాల్గొంటారా లేదా అన్న విషయం తెలియరాలేదు. కాగా, పాలస్తీనియన్ కమిటీ పేర్లు దాదాపు నిర్ణయించేశారని ప్రచారం జరుగుతున్నది.
యుద్ధానాంతరం గాజా పాలనలో హమాస్ పాల్గొనకపోవడమే కాకుండా గాజా శాంతి రెండవ దశ ప్రక్రియలో హమాస్ నిరాయుధీకరణకు కూడా ట్రంప్ ప్రణాళిక పిలుపునిచ్చింది. దీనిని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ చాలాకాలంగా రెడ్‌లైన్‌గా అభివర్ణిస్తోంది. హమాస్ దీర్ఘకాలిక యుద్ధ విరమణను అంగీకరిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడి జరిగితే తప్ప ఈ కాలంలో ఆ సంస్థ ఆయుధాలను అస్సలు ఉపయోగించకూడదని విశ్వసనీయ వర్గాలు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపాయి.
20 అంశాల ప్రణాళిక ప్రకారం గాజా దాని పొరుగువారికి ముప్పు కలిగించని ఉగ్రవాద రహిత జోన్‌గా మారాలి. యుద్ధంలో దెబ్బతిన్న భూ భాగంపై భవిష్యత్తు పాలనలో హమాస్‌కు ఎటువంటి పాత్ర ఉండదని, దాని సైనిక మౌలిక సదుపాయాలు, ఆయుధాలను నాశనం చేయాలని, పునర్ నిర్మించ కూడదని ప్రణాళిక పేర్కొంది. హమాస్ నిరాయుధీకరణ అన్న ప్రశ్నకే తావు లేదని, అది చర్చించదగిన అంశం కాదని మరో హమాస్ ప్రతినిధి ఒకరు ట్రంప్ శాంతి ప్రణాళికను ప్రస్తావిస్తూ తెలిపారు. మరోవైపు తమ దేశ బందీలు సోమవారంలోగా విడుదల అవుతారని ఇజ్రాయెల్ ఆశాభావం వ్యక్తం చేసింది. దీనిపై హమాస్ స్పందిస్తూ బందీలను అప్పగిస్తామని తెలిపింది.