ఇస్లామాబాద్: పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్‌ల మధ్య సాయుధ ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో అఫ్ఘనిస్థాన్ దళాలు ముందస్తు హెచ్చరిక లేకుండా దాడులకు పాల్పడ్డాయని, దీనికి ప్రతీకారంగా తాము 19 అఫ్ఘన్ మిలిటరీ పోస్టులను, ఉగ్రవాద శిబిరాలను స్వాధీనం చేసుకున్నామని పాకిస్థాన్ చెప్పింది. దీనికి తాలిబన్ ప్రభుత్వం స్పందిస్తూ, తాము జరిపిన ప్రతీకార దాడుల్లో 58 మంది పాక్ సైనికులు మరణించారని, 30 మంది సైనికులు గాయపడ్డారని తెలిపింది. ఆదివారం తాము చేసిన ప్రతీకార దాడులు విజయవంతమయ్యాయని ఆ దేశ రక్షణ శాఖ పేర్కొంది. పాక్‌కు దీటుగా బదులిస్తాయని హెచ్చరించింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని అంగూర్ అడ్డా, బజౌర్, కుర్రం, దిర్, చిత్రాల్; బలూచిస్థాన్‌లోని బరమ్‌చాలలోని పాకిస్థానీ పోస్టులపై అఫ్ఘన్ దళాలు దాడులు చేశాయి.
తాలిబన్ ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ..డ్యూరండ్ లైన్ వెంబడి ప్రతీకార కార్యకలాపాల్లో 19 పాకిస్థానీ సెక్యూరిటీ ఔట్‌పోస్టులను ధ్వంసం చేశామని చెప్పారు. ఈ కార్యకలాపాల్లో 9 మంది తమ సైనికులు మరణించారని, 16 మంది గాయపడ్డారని చెప్పారు. ఖతార్, సౌదీ అరేబియాల విజ్ఞప్తి మేరకు శనివారం అర్ధరాత్రి నుంచి ఈ ఆపరేషన్‌ను నిలిపేశామన్నారు. ఐసిస్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తున్నదని జబీహుల్లా ఆరోపించారు. వారిని పాక్ నుంచి వెళ్లగొట్టాలని, లేదా, తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఐసిస్ తమ దేశంతో పాటు అనేక దేశాలకు ముప్పుగా పరిణమించిందన్నారు. తమ భూభాగంలో ఐసిస్ లేకుండా చేయడానికి తమ ప్రభుత్వం చర్యలను ప్రారంభించినప్పటి నుంచి ఐసిస్ కోసం ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో కొత్త శిక్షణ కేంద్రాలను పాకిస్థాన్ ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు.
పాకిస్థాన్ హోం మంత్రి మొహిసిన్ నఖ్వీ మాట్లాడుతూ, తాలిబన్లు ఎటువంటి హెచ్చరిక లేకుండా బోర్డర్ పోస్టులపై దాడులు జరిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలపై కాల్పులు జరిపారని ఆరోపించారు. తమ దళాలు తాలిబన్ దళాలకు దీటుగా బదులిచ్చాయని పేర్కొన్నారు. రెచ్చగొడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇటుకలకు రాళ్లతో అఫ్ఘన్‌కు జవాబు చెబుతున్నామన్నారు.
ఇరుగు పొరుగు దేశాలైన అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు కొద్ది రోజుల నుంచి క్షీణిస్తున్నాయి. పాకిస్థాన్‌పై తెహరీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ పదే పదే ఉగ్ర దాడులకు పాల్పడుతున్నది. ఈ సంస్థ అఫ్ఘనిస్థాన్ గడ్డపై నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఒరక్జాయ్ జిల్లాలో కూడా ఇది పని చేస్తున్నది. ఈ సంస్థ గత వారం నిర్వహించిన దాడుల్లో 11 మంది పాకిస్థానీ సైనికులు మరణించారు.
అఫ్ఘన్ రాజధాని నగరం కాబూల్‌లో గురువారం రాత్రి పేలుళ్లు వినిపించాయి. ఈ దాడులకు పాకిస్థాన్‌దే బాధ్యత అని అఫ్ఘనిస్థాన్ ఆరోపించింది. అయితే, తమ ప్రమేయం గురించి ధ్రువీకరించడానికి లేదా తిరస్కరించడానికి పాక్ సైన్యం నిరాకరించింది. ఈ నేపథ్యంలో అఫ్ఘన్ భద్రతా దళాలు శనివారం రాత్రి పాకిస్థాన్‌పై దాడులు చేశాయి. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఆదివారం తెల్లవారుజామున దాడులు జరిపింది.