ముంబై, అక్టోబర్ 10: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.11,909 కోట్ల నికర లాభాన్ని గడించింది. మార్జిన్లు తగ్గుముఖం పట్టడంతో లాభాల్లో వృద్ధి సింగిల్ డిజిట్‌కు పరిమితమైందని పేర్కొంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.11,342 కోట్ల లాభంతో పోలిస్తే 4.99 శాతం వృద్ధిని కనబరుచగా..జూన్ త్రైమాసికంలో వచ్చిన రూ.12,040 కోట్ల లాభంతో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. 2023-24 రెండో త్రైమాసికంలో రూ.60,698 కోట్లగా నమోదైన కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను 7.06 శాతం వృద్ధితో రూ.64,988 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గత కొన్ని త్రైమాసికాలుగు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ త్రైమాసికంలోనూ కొనసాగాయని టీసీఎస్ సీఈవో, ఎండీ కే కృతివాసన్ తెలిపారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలు రికవరీ బాట పట్టాయని, గత త్రైమాసికంలో స్వల్ప వృద్ధిని నమోదు చేసుకున్నాయన్నారు. మరోవైపు, రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్‌ను ప్రతిపాదించింది. ఈ ఏడాది డివిడెండ్ ప్రకటించడం ఇది రెండోసారి.