ముంబై, మే 2 : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అమెరికా-భారత్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలుండటం, రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లుకావడం మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. వీటికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎగబడి కొనుగోళ్లు జరపడం, అంతర్జాతీయ మార్కెట్లు ఆశాజనకంగా ట్రేడవడంతో సూచీలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇంట్రాడేలో 900 పాయింట్లకు పైగా లాభపడిన 3 0 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 259.75 పాయింట్లు అందుకొని 80,501.99 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 12.50 పాయింట్లు పెరిగి 24,346.70 పాయింట్లకు చేరుకున్నది.
ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో అదానీ పోర్ట్ షేరు 4 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్టీఐ, మారుతి, టాటా మోటర్స్, ఐటీసీ, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగియగా..నెస్లె, ఎన్టీపీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, పవర్‌గ్రిడ్, టైటాన్ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా సర్వీసెస్ 1.67 శాతం అధికంకాగా, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ఐటీ రంగ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించగా..టెలికం, కన్జ్యూమర్ డ్యూరబుల్, పవర్, యుటిలిటీ, మెటల్, రియల్టీ రంగ షేర్లు నష్టపోయాయి.