Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లకుపైగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాలతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పెట్టుబడులను ఉప సంహరించుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్ ట్రేడ్ పాలసీని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. పలు దేశాలపై సుంకాలను అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతిన్నది. ఈ ప్రభావం దలాల్ స్ట్రీట్‌పై సైతం పడింది. ఈ క్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. క్రితం సెషన్‌తో పోలిస్తే సూచీలు 77,261.72 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలయ్యాయి.
ఆ తర్వాత కొద్దిసేపటికే మార్కెట్లు పతనమయ్యాయి. ఇక దశలోనూ మార్కెట్లు కోలుకోలేదు. ఇంట్రాడేలో 77,337.36 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెనెక్స్.. అత్యల్పంగా 75,641.87 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది. ఇక చివరకు 1,235.08 పాయింట్ల నష్టంతో 75,838.36 వద్ద ముగిసింది. నిఫ్టీ 299.45 పాయింట్లు పతనమై.. 23,045.30 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,019 షేర్లు లాభపడ్డాయి. మరో 2,552 షేర్లు పతనం కాగా.. 79 షేర్లు మారలేదు. నిఫ్టీలో ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌బీఐ అత్యధికంగా నష్టపోయాయి. అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్, టాటా కన్స్యూమర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి రెండుశాతం పతనమయ్యాయి. అన్ని రంగాల సూచీలు కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి 4 శాతం వరకు తగ్గాయి. బ్యాంక్, పవర్, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ ఒక్కొక్కటి 2 శాతం దిగజారాయి.