Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మంగళవారం ఉదయం ట్రేడింగ్ (Trading) ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా (USA), ఇరాన్ (Iran) దేశాల మధ్య శాంతి చర్చలు జరగవచ్చన్న ఆశలు, అంతర్జాతీయంగా తగ్గుతున్న ముడిచమురు ధరలు లాంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చాయి. దాంతో సూచీలు పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్ దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 79,000 మార్క్‌ను దాటింది.
ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే సెన్సెక్స్ 450 పాయింట్ల లాభంతో 79,000 మార్కును దాటింది. నిఫ్టీ కూడా 135 పాయింట్లు పెరిగి 24,500 మార్కును దాటింది. మధ్యాహ్నం 12 గంటలకు సెన్సెక్స్ 650 పాయింట్లకు పైగా లాభంతో 79,200 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా నిఫ్లీ కూడా 175 పాయింట్లకుపైగా లాభంతో 24,542 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది. రంగాల వారీగా చూస్తే రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది.
అయితే ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ వంటి కొన్ని షేర్లు నష్టాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికాతో శాంతి చర్చలకు హాజరయ్యేందుకు ఇరాన్ సుముఖత చూపుతున్నట్లు వచ్చిన నివేదికలు గ్లోబల్ మార్కెట్లకు ఊతమిచ్చాయి. మరోవైపు సోమవారం నాటి ట్రేడింగ్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,059.93 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DII) రూ.2,966.89 కోట్లను పెట్టుబడిగా పెట్టారు.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 0.93% తగ్గి $94.59కి చేరింది. మార్కెట్లో అస్థిరతలు పెరగడం, ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో లాభాల స్వీకరణకు అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండగా.. సోమవారం అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.