Stock markets : అంతర్జాతీయ మార్కెట్ల (Internationla markets) నుంచి ప్రతికూల సంకేతాలు ఎదురుకావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. త్రైమాసిక ఫలితాల్లో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అదే సూచీలపై ఒత్తిడి పెంచింది. గ్రీన్లాండ్ (Greenland) విషయంలో తమకు మద్దతు తెలుపని యూరోపియన్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ ఉదయం 83,494.49 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 83,570.35) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 82,898.31 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 324.17 పాయింట్ల నష్టంతో 83,246.18 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.91గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్, ఐసీఐసీఐ, ఎటర్నెల్, టైటాన్, అదానీ పోర్ట్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఇండిగో, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 63.57 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4,667 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.