Stock Markets : పశ్చిమాసియా (West Asia) లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్ల (Stock Markets) ను కుదిపేశాయి. ప్రపంచ వృద్ధి, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 1312.91 పాయింట్లు నష్టపోయి 76,015.28 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) 360.3 పాయింట్లు పతనమై 23,815.85 వద్ద ముగిసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగుతాయనే భయాలు, బలహీన అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి.
పశ్చిమాసియాలో ఇంకా తెరపడని ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆందోళనలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీ ఏకంగా 4 శాతం పతనమైంది. రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా రంగాల షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. మరోవైపు ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్ వంటి రక్షణాత్మక రంగాల షేర్లు కొంతవరకు నిలదొక్కుకున్నాయి.
నిఫ్టీలో టైటాన్ కంపెనీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), ఎస్బీఐ షేర్లు ప్రధానంగా నష్టపోగా.. కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్ లాభపడ్డాయి. కాగా మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడాలంటే నిఫ్టీ 24,000 స్థాయిని దాటాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత రూపాయి విలువ కూడా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ఠస్థాయి (రూ.95.80) కి పడిపోవడం మార్కెట్‌పై అదనపు ఒత్తిడిని పెంచిందని అంటున్నారు.