Stock markets : దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock markets) లో లాభాల జోష్ కొనసాగుతోంది. గత నాలుగు సెషన్లలో లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ ఐదో సెషన్లో కూడా లాభాలు మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, భారతీయ సూచీలు ఫుల్ జోష్లో ట్రేడయ్యాయి. అమెరికా టారిఫ్లపై ఉన్న ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్కు ఊరట లభించింది.
ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బ్యాంక్ నిఫ్టీ చరిత్రలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. దాంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 855.30 పాయింట్ల లాభంతో 79,408 వద్ద ముగిసింది. అంటే 1.09 శాతం లాభపడింది. అదేవిధంగా నిఫ్టీ సైతం 273.90 (1.15 శాతం) పాయింట్ల లాభంతో 24,125 వద్దకు సెటిలైంది.
మొత్తంగా చూస్తే 2,829 షేర్లు లాభపడగా, 1093 షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. ఇంకో 149 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా ఉన్నాయి.