Stock Markets : స్టాక్ మార్కెట్ల (Stock Markets) పై మళ్లీ యుద్ధం దెబ్బ పడింది. పాకిస్థాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. చర్చలు విఫలం కావడంవల్ల అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 101 డాలర్లు దాటింది. దాంతో మార్కెట్లపై బేర్ పట్టుబిగించింది. అదేవిధంగా ఇరాన్ పోర్టులను, ఆ పోర్టులకు వచ్చిపోయే నౌకలకు తమ బలగాలు దిగ్బంధిస్తాయని ట్రంప్ హెచ్చరించడం కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది.
అదేవిధంగా ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నదన్న వార్తలు కూడా స్టాక్ మార్కెట్లను నష్టాల్లో ముంచాయి. దాంతో ఇవాళ్టి ట్రేడింగ్‌లో 76,134 పాయింట్ల వద్ద ప్రారంభమైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్.. ఏకంగా 1,415 పాయింట్లు కోల్పోయింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం 479 పాయింట్లు కోల్పోయి 23,571 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.