గురువారం 28 మే 2020
Business - Mar 31, 2020 , 00:41:56

మటాష్‌

మటాష్‌

  • నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు
  • 1,375 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌
  • 379 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 
  • వెంటాడిన కరోనా భయాలు

న్యూఢిల్లీ, మార్చి 30: దేశీయ స్టాక్‌ మార్కె ట్లు మళ్లీ నష్టాలబాట పట్టాయి. సోమవారం ట్రేడింగ్‌లో మదుపరులను కరోనా వైరస్‌ భయాలు వెంటాడాయి. ఉదయం ఆరంభం నుంచే నేలచూపులు చూసిన సూచీ లు.. చివరిదాకా అదేతీరును కనబరిచాయి. ఫలితంగా బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ 1,375.27 పాయింట్లు లేదా 4.61 శాతం పతనమై 28,440.32 వద్దకు చేరితే, ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 379.15 పాయింట్లు లేదా 4.38 శాతం కోల్పోయి 8,281.10 వద్ద నిలిచింది. కొవిడ్‌-19 కేసుల సంఖ్య వెయ్యిని దాటడం, ఇప్పటిదాకా 29 మంది చనిపోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రియల్టీ, ఆటో, టెలికం షేర్లూ మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 1,500 పాయింట్లకుపైగా నష్టపోయింది. బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్‌ విలువ అత్యధికంగా 12 శాతం పడిపోయింది.

రూ.3.35 లక్షల కోట్లు ఆవిరి

స్టాక్‌ మార్కెట్ల నష్టాలతో ఈ ఒక్కరోజే మదుపరుల సంపద రూ.3.35 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ రూ.3,35,192.89 కోట్లు హరించుకుపోయి రూ.1,09,63,832.17 కోట్లకు పరిమితమైంది. మొత్తం 1,392 షేర్లు నష్టపోయాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలూ 2.13 శాతం మేర క్షీణించాయి. 

18 ఏండ్ల కనిష్ఠానికి క్రూడ్‌ ధర

గ్లోబల్‌ మార్కెట్‌లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 18 ఏండ్ల కనిష్ఠాన్ని తాకింది. దాదాపు 23 డాలర్లకు క్షీణించింది. 2002 తర్వాత ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. సౌదీ, రష్యా మధ్య ధరల యుద్ధం మార్కెట్‌ను కుదిపేస్తున్నది. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 70 పైసలు దిగజారి 75.59 వద్ద స్థిరపడింది. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావం మధ్య డాలర్లకు డిమాండ్‌ ఏర్పడింది. 


logo