న్యూఢిల్లీ, జనవరి 4: పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న స్టాక్ ర్యాలీకి అనుగుణంగా భారత్‌లో సైతం మంగళవారం మార్కెట్ జోరుగా పెరిగింది. క్రితం రోజు 900 పాయింట్లకుపైగా జంప్ చేసిన బీఎస్ఈ సెన్సెక్స్ తాజాగా 673 పాయింట్లు పెరిగి 59,855 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ అవలీలగా 17,800 పాయింట్ల స్థాయిని అధిగమించింది. ఈ సూచి 180 పాయింట్లు ర్యాలీ జరిపి 17,805 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్-30 షేర్లలో ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్‌లు 5.5 శాతం వరకూ ఎగిసాయి. మరోవైపు సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్‌లు స్వల్పంగా తగ్గాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ పవర్, యుటిలిటీస్, ఎనర్జీ, బ్యాంకింగ్ సూచీలు 2.25 శాతం వరకూ అధికమయ్యాయి. ఇక అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్ కొత్త రికార్డులను నెలకొల్పగా, టోక్యో, హాంకాంగ్, సియోల్ స్టాక్ సూచీలు లాభాలతో ముగిసాయి. యూరప్‌లోని ప్రధాన మార్కెట్లయిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు కూడా బలపడ్డాయి.
రూ.5.36 లక్షల కోట్లు పెరిగిన సంపద
కొత్త సంవత్సరం వరుసగా రెండు రోజులపాటు జరిగిన మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా రూ.5.36 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2,71,36, 351 కోట్లకు చేరింది.
పాజిటివ్‌గా ఇన్వెస్టర్లు..
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఆర్థిక వ్యవస్థలపై తక్కువగా ఉంటాయన్న అంచనాలతో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్ నెలకొందని, దీంతో ఈక్విటీల ర్యాలీ సాధ్యపడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. కొత్త సంవత్సరం తొలిరోజున అమెరికా స్టాక్ సూచీలు రికార్డుస్థాయికి పెరగడం, కొద్ది వారాలుగా వరుస విక్రయాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) సోమవారం భారీ కొనుగోళ్లు జరపడం మన మార్కెట్ కలిసొచ్చాయని జియోజిత్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ వివరించారు.