Stock market : భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. వరుసగా ఐదు సెషన్లలో లాభాలు పొందిన స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల బాటలో నడిచింది. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 607.08 పాయింట్లు (0.78%) నష్టపోయి 76,802.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 155.05 పాయింట్లు (0.64%) నష్టపోయి 24,013.10 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక దశలో బీఎస్ఈ సెన్సెక్స్ 940.26 పాయింట్లు నష్టపోయి 76,469.72 కనిష్టానికి చేరింది.
గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీ యాక్సెంచర్ ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం, గతంలో ప్రకటించిన 5 శాతం రెవెన్యూ వృద్ధి అంచనాలను 4 శాతం తగ్గించడం మార్కె్ట్లో ఐటీ షేర్ల పతనానికి దారితీసింది. యాక్సెంచర్ ప్రకటనతో దేశీయ ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.65 శాతం పతనమైంది. అమెరికా మార్కెట్లో యాక్సెంచర్ షేర్లు 18 శాతం పతనమయ్యాయి. భారతీయ ఐటీ కంపెనీలకు సంబంధించి ఇన్ఫోసిస్ 6.5 శాతం, టీసీఎస్ 3.06 శాతం, టెక్ మహీంద్రా 2.3 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీ 2.23 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.81 శాతం, విప్రో 1.28 శాతం నష్టపోయాయి. బీఎస్ఈలో ఎటర్నల్, పవర్ గ్రిడ్, భారతి ఎయిర్టెల్, టైటాన్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, ఐటీసీ, ట్రెంట్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాలు పొందాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యునీలీవర్ సంస్థలు నష్టపోయాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి, 94.33 వద్ద కొనసాగింది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడం, హార్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో చమురు ధరలు 1 శాతం పైగా పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 78.33 డాలర్లుగా, డబ్ల్యూటీఐ (వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్) క్రూడాయిల్ ధర కూడా 1 శాతం పైగా తగ్గి 75.88 డాలర్ల వద్ద కొనసాగింది.