Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు కూడా లాభాలు పొందడం విశేషం. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1205 పాయింట్ల లాభంతో 75,273.45 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 394.05 పాయింట్ల లాభంతో 23,306.45 వద్ద ముగిసింది. సెన్సెక్స్ మంగళవారం 74,068.45 పాయింట్ల వద్ద ముగియగా, బుధవారం ఉదయం 74,652.01 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది.
ఒక దశలో 75,849.76 పాయింట్లను తాకింది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. బుధవారం అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగడం భారతీయ స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. అలాగే ఇరాన్-అమెరికా మధ్య చర్చలు, ట్రంప్ శాంతి ప్రతిపాదన వంటి అంశాలు కూడా మార్కెట్‌కు ఊతమిచ్చాయి. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఆసియా మార్కెట్లైన దక్షిణ కొరియా బెంచ్‌మార్క్ కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ సెంగ్ ఇండెక్స్ వంటివి బుధవారం లాభాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ షేర్లు అత్యధికంగా 4.39 శాతం లాభాలు పొందాయి. లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ 4 శాతం, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 3.82 శాతం, టైటాన్ కంపెనీ లిమిటెడ్ 3.50 శాతం, ట్రెంట్ లిమిటెడ్ 3.39 శాతం పెరిగాయి.
టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాలు చవిచూశాయి. మరోవైపు తాజా పరిణామాలతో అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ చమురు ధర 100 డాలర్ల దిగువకు చేరింది. ఈ రోజు దాదాపు 99 డాలర్ల వద్ద ఆయిల్ ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 93.96గా ఉంది. అయితే, బంగారం ధరలు మాత్రం బుధవారం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర 4,554 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్స్ వెండి ధర 72 డాలర్లకుపైగా కొనసాగుతోంది.