Stock Markets | ముంబై, డిసెంబర్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు పడుతూ.. లేస్తూ.. పయనించినా, ఆఖర్లో మాత్రం లాభాల్లోనే ముగుస్తున్నాయి. ఇలా వరుసగా 5 రోజుల్లో మదుపరుల సంపద సైతం లక్షల కోట్ల రూపాయల్లో పెరగడం విశేషం. గురువారం ఒక్కరోజే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 809.53 పాయింట్లు లేదా 1 శాతం పుంజుకొని 81,765.86 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 1,361.41 పాయింట్లు ఎగబాకడం గమనార్హం. అయితే ఈ దశలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీ దిగిరాక తప్పలేదు. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 240.95 పాయింట్లు లేదా 0.98 శాతం ఎగిసి 24,708.40 దగ్గర నిలిచింది.
భారతీయ ఈక్విటీలు ఇంతలా బలపడటానికి అమెరికా మార్కెట్ల ర్యాలీ బాగా కలిసొచ్చింది. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ ఆకర్షణీయ వృద్ధిని కనబరుస్తుండటం, ద్రవ్యోల్బణం దిగొస్తుండటంతో తొలిసారి డోజోన్స్ 45వేల మార్కును దాటింది. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన దగ్గర్నుంచీ అమెరికా వృద్ధి సూచీలు పరుగులు పెడుతున్నాయి మరి. అక్కడి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చీఫ్ పావెల్ కూడా దేశ ఆర్థిక ముఖచిత్రం బాగుపడిందని కొనియాడటం.. మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపర్చింది. ఇక దేశీయంగా చూస్తే.. ఐటీ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా షేర్లు భారీ లాభాలను అందుకున్నాయి. ఐటీ రంగ సూచీ గరిష్ఠంగా 1.96 శాతం పెరిగింది.
గతకొంత కాలంగా దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ దిశగా అడుగులు వేస్తున్న విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ).. మళ్లీ కొనుగోళ్ల వైపు వచ్చారు. బుధవారం రూ. 1,797.60 కోట్ల విలువైన షేర్లను కొన్నట్టు స్టాక్ ఎక్సేంజీ వర్గాలు తెలిపాయి. దీంతో గురువారం సైతం ఇదే జోష్ ఉందన్న అంచనాలు వస్తున్నాయి. ఇక సెన్సెక్స్‌లో టైటాన్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లూ పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.27 శాతం, స్మాల్‌క్యాప్ 0.16 శాతం అందిపుచ్చుకున్నాయి. ఇక శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ఉండనున్నాయి. దీంతో మార్కెట్ ట్రేడింగ్‌పై ఈ ప్రభావం ఎక్కువేనని చెప్పవచ్చు. గత ఏడాది ఏప్రిల్ నుంచి కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచుతున్న విషయం తెలిసిందే.
వరుసగా ఐదోరోజూ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో ఆయా సంస్థల మార్కెట్ విలువ కూడా అదే స్థాయిలో పెరుగుతూపోతున్నది. గడిచిన 5 రోజుల్లో బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.15,18,926.69 కోట్లు ఎగిసి రూ.4,58,17,010.11 కోట్లకు (5.41 ట్రిలియన్ డాలర్లు) చేరింది. ఈ ఐదు రోజుల్లో సెన్సెక్స్ 2,722.12 పాయింట్లు లేదా 3.44 శాతం పుంజుకున్నది. ‘అంతర్జాతీయ మార్కెట్లలో డోజోన్స్, ఎస్అండ్పీ 500, నాస్డాక్ లాభాల్లో కదలాడుతుండటం.. భారతీయ మార్కెట్లకు లాభిస్తున్నది’ అని మెహెతా ఈక్విటీస్ లిమిటెడ్ రిసెర్చ్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ తాప్సీ అన్నారు. ఇక గురువారం జపాన్, చైనా సూచీలు లాభాల్లో, దక్షిణ కొరియా, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.